శ్రీరాముని ప్రతిష్ఠాపన జరిగిన మొదటి 100 రోజుల పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు 1000 రైళ్లను నడపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. జనవరి 22వ తేదిన ఆలయ ప్రారంభోత్సవం నిర్వహించి జనవరి 23వ తేది నుంచి ఆలయాన్ని భక్తుల కోసం తెరిచి ఉంచనున్నారు. ఈ రైళ్ల ప్రారంభం 4 రోజుల ముందు అంటే జనవరి 19వ తేది నుంచి ప్రారంభమవుతుంది. ఈ రైళ్లు ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, పూణే, కోల్కతా, నాగ్పూర్, లక్నో, జమ్మూతో సహా వివిధ నగరాల నుంచి అయోధ్యకు నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది.
రాముడి దర్శనం చేసుకున్న భక్తులు ఆ రైళ్లలోనే తమ స్వగ్రామాలకు చేరుకోవచ్చు. ఈ మేరకు అయోధ్య రైల్వే స్టేషన్ను అధికారులు పునరుద్ధరిస్తున్నారు. రోజుకు 50 వేల మంది ప్రయాణించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పునరుద్ధరించిన రైల్వే స్టేషన్ జనవరి 15వ తేది నుంచి అన్ని సేవలకు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. అదే సమయంలో యాత్రికులు అయోధ్యకు వారి సొంత చార్టర్డ్ రైలును బుక్ చేసుకోవడానికి కూడా అనుమతించారు. ప్రారంభోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో భక్తులు అయోధ్యకు చేరుకుంటూ వస్తున్నారు.
అయోధ్య రామ మందిర ఆలయ నిర్మాణానికి 18,000 కోట్ల అంచనా వ్యయంతో లార్సెన్ అండ్ టూబ్రో గ్రూప్ ఈ స్మారక ఆలయాన్ని నిర్మించడానికి బాధ్యత తీసుకుంది. ఈ మహా దేవాలయంలో పూజలు చేసేందుకు ఇప్పటికే దేశం నలుమూలల నుంచి అర్చకులను నియమించినట్లు యాజమాన్యం తెలిపింది. ఆలయ పూజ కోసం 50 మందిని మాత్రమే ప్రస్తుతం ఎంపిక చేసినట్లు తెలిపింది.