రోడ్డు ప్రయాణాల సమయంలో ఆధునిక సాంకేతికతను నమ్ముకుని అది ప్రాణాల మీదకు తెచ్చిన ఘటన కేరళ(Kerala)లో చోటుచేసుకుంది. ఇద్దరు యువ డాక్టర్లు జీపీఎస్(GPS)ను నమ్ముకొని కారు నదిలోకి నడిపించి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన కేరళలోని ఎర్నాకుళం (Ernakulam) జిల్లాలో జరిగింది. రాత్రివేళ బోరున వర్షం కురుస్తున్న సమయంలో జీపీఎస్‌ను నమ్ముకుని కారు నడిపి ఇద్దరు యువ వైద్యులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ప్రయాణ సమయంలో భారీ వర్షం పడుతుండటంతో రోడ్డు మార్గం సరిగా కనిపించడంలేదు. అద్వైత్ జీపీఎస్ అనుసరించి డ్రైవింగ్ (Driving) చేస్తున్నట్లు అతడి పక్కన కూర్చొన్న ఎంబీబీఎస్ విద్యార్థిని తమన్నా చెప్పింది. ఈ క్రమంలో జీపీఎస్ రీరూటైంది. దానిని అనుసరించిన అతడు మార్గం మధ్యలో నీరు నిలిచి ఉన్న ప్రాంతాన్ని రోడ్డు అని అనుకున్నాడు.
కారును నేరుగా నీటిలోకి తీసుకెళ్లాడు. అది నది అని గుర్తించేలోపే వారి కారు నీటిలో మునిగిపోయింది. ఈ ఘటన అర్ధరాత్రి 12.30 సమయంలో చోటు చేసుకొంది.స్థానికులు స్పందించి ముగ్గురిని రక్షించారు. అద్వైత్ (Advaita), అజ్మల్ ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో బయటపడిన డాక్టర్ గజిక్ తబ్సీర్ మాట్లాడుతూ.. జీపీఎస్ రీరూట్ తర్వాతే ప్రమాదం జరిగిందని తెలిపారు. ‘మేము జీపీఎస్ ఉపయోగించాం.. కానీ, నేను వాహనం నడపలేదు.. అందువల్ల అప్లికేషన్లో సాంకేతిక లోపం లేదా మానవ తప్పిదమా అని నేను నిర్ధారించలేను’ అని అన్నారు. ప్రమాదం (Accident) నుంచి బయటపడిన ముగ్గురూ ప్రస్తుతం కోచి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. డాక్టర్ అద్వైత్ మృతదేహాన్ని కలామ్సెర్రీ మెడికల్ కాలేజీకి.. డాక్టర్ అజ్మల్ మృతదేహాన్ని త్రిశూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రికి పోస్ట్‌మార్టం కోసం తరలించారు.