»After 200 Years Shivaji Is The Weapon Wagh Nakh Of India
Wagh nakh: 200 ఏళ్ల తర్వాత..భారత్‌కు శివాజీ ఆయుధం
200 ఏళ్ల తర్వాత భారతదేశానికి శివాజీ ఉపయోగించిన పులి పంజా(Wagh Nakh) ఆయుధం తిరిగి రానుంది. ప్రతాప్ గఢ్ యుద్ధంలో ఉపయోగించిన కీలకమైన ఈ ఆయుధాన్ని శివాజీ ఉపయోగించి ప్రత్యర్థులను మట్టుబెట్టాడు. ఆ తర్వాత అనేక రాజ్యాలను కైవసం చేసుకున్నారు.
After 200 years Shivaji is the weapon wagh nakh of India
భారతదేశానికి చెందిన కోహీనూర్ డైమండ్ సహా అనేక విలువైన వస్తువులను బ్రిటిషర్లు లండన్ తీసుకెళ్లి అక్కడి మ్యూజియంలో పెట్టుకున్నారు. అయితే వాటిలో కొన్నింటిని ఇండియాకు తిరిగి రప్పించేందుకు భారత ప్రభుత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి 350వ వార్షికోత్సవం అయిన సందర్భంగా తాను వాడిన ఓ అరుదైన యుద్ధ ఆయుధం పులి పంజా(Wagh Nakh) లండన్ నుంచి ఇండియాకు రాబోతుంది.
ఈ ఏడాది చివర్లో భారతదేశానికి రానుందని తెలుస్తోంది. ఈ మేరకు లండన్‌లోని విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం, మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MOU)పై చేసుకున్నారు. అయితే ఇది కేవలం మూడేళ్లు మాత్రమే ఇండియాలో ఉంటుందని..మళ్లీ లండన్ తీసుకెళ్తారని తెలుస్తోంది. దీనిని ఛత్రపతి శివాజీ మహారాజ్‌కు చెందిన 17వ శతాబ్దపు వాఘ్ నఖ్(పులి పంజా) ఆయుధమని పిలుస్తారు. 200 ఏళ్ల తర్వాత భారత్ వస్తున్న ఆ ఆయుధాన్ని సౌత్ ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ మ్యూజియంలో మూడేళ్ల పాటు ప్రదర్శనకు ఉంచనున్నారు.
1659లో జరిగిన ప్రతాప్ గఢ్ యుద్ధం చరిత్రలో చాలా ప్రధానమైనది. ఈ యుద్ధంలో మరాఠా నాయకుడు ఛత్రపతి శివాజీ లోహపు వాఘ్ నఖ్ ను చేతిలో ధరించి ప్రత్యర్థి బీజాపూర్ సైన్యానికి చెందిన ప్రత్యర్థి అఫ్జల్ ఖాన్‌ను పొట్టనపెట్టుకున్నాడు. దీంతో ఆ ఆయుధం ద్వారా అఫ్జల్ ఖాన్‌పై ఛత్రపతి శివాజీ మహారాజ్ విజయం సాధించారని చెబుతుంటారు. అంతేకాదు ఆ తర్వాత శివాజీ తన రాజ్యాన్ని నలువైపులా విస్తరించాడు.
మరాఠాల చివరి పీష్వా (ప్రధానమంత్రి), బాజీ రావ్ II, మూడవ ఆంగ్లో-మరాఠా యుద్ధంలో ఓటమి తర్వాత జూన్ 1818లో బ్రిటిష్ వారికి లొంగిపోయాడు. ఆ తర్వాత కాన్పూర్ సమీపంలోని బితూర్‌కు బహిష్కరించబడ్డాడు. ఆ సమయంలో ఈ ఆయుధాన్ని గ్రాంట్ డఫ్‌కి కూడా అప్పగించినట్లు తెలుస్తోంది. అయితే అవే పులి గోళ్లను దాదాపు 160 ఏళ్ల క్రితం శివాజీ ఉపయోగించినవా కాదా అనేది మాత్రం ధృవీకరించడం సాధ్యం కాలేదు. మరోవైపు శివాజీ యుద్ధంలో ఉపయోగించిన ఆయుధం ఇది కాదని పలువురు అంటుంన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్నదానిని 1818లో సతారాలో అవతరించిన ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ అధికారి జేమ్స్ గ్రాంట్ డఫ్ స్వాధీనం చేసుకున్నారని మరికొంత మంది చెబుతున్నారు.