UK Elections 2024: యూకే ప్రధాన మంత్రిగా ఉన్న భారత సంతతి వ్యక్తి రిషి సునాక్కు ఓటమి ఖరారైంది. బ్రిటన్లో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆయకు చెందిన కన్జర్వేటివ్ పార్టీ(Conservative Party) ఓటమి ఖరారైంది. ప్రతిపక్షంగా ఉన్న లేబర్ పార్టీ అక్కడ ఘన విజయం సాధించేలా కనిపిస్తోంది. దీంతో ఈ ఎన్నికల్లో ఓటమిని తాను అంగీకరిస్తున్నట్లు రిషి సునాక్ తెలిపారు. తనని క్షమించమని రిషి సునాక్(Rishi Sunak ) తమ పార్టీ నేతలకు చెప్పారు. దేశ ప్రధానిగా తాను చేయవలసినదంతా చేశానని అన్నారు.
లేబర్ పార్టీ విజయం సాధించడంపై రిషి సునాక్ మాట్లాడారు. ప్రత్యర్థిగా ఉన్న కీర్ స్టార్మర్కు(Keir Starmer) ఆయన అభినందనలు చెప్పారు. బ్రిటన్ ప్రజలు నిర్ణయాత్మకంగా ఇచ్చిన తీర్పను అంగీకరిస్తున్నట్లుగా తెలిపారు. అధికారం మారుతూ ఉండొచ్చు. కానీ అది చాలా సుహృద్భావ వాతావరణంలోనే జరుగుతోంది అంటూ చెప్పారు. శాంతియుతమైన పంథాలోనే ఈ మార్పులు జరుగుతుండటం గ్రేట్ అంటూ చెప్పుకొచ్చారు.
ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదు. అయితే లేబర్ పార్టీ విజయం మాత్రం ఖారారు అయ్యింది. ఇప్పటి వరకు ఈ పార్టీ 341 సీట్లలో విజయం సాధించింది. అలాగే రిషి సునాక్కి చెందిన కన్జర్వేటివ్ పార్టీ మాత్రం 75 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. బ్రిటన్ పార్లమెంటులో 650 సీట్లు ఉన్నాయి. ఓ పార్టీ అధికారంలోకి రావాలంటే 326 సీట్లు వస్తే సరిపోతుంది. ఆ సంఖ్యను లేబర్ పార్టీ(labour party) ఇప్పటికే దాటేసింది. దీంతో కన్జర్వేటివ్ పార్టీ ఓటమి లాంఛనంగా మారింది. గత 14 ఏళ్లుగా బ్రిటన్లో కన్జర్వేటివ్ పార్టీ అధికారంలో ఉంది. ఇంత సుదీర్ఘ సమయం తర్వాత అక్కడ ఇప్పుడు మరో పార్టీ అధికారంలోకి వస్తోంది.