ప్రస్తుతం బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. బ్రిటన్ను 14 ఏళ్ల పాటు పాలించిన కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి.
UK Elections: ప్రస్తుతం బ్రిటన్‌లో సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. బ్రిటన్ను 14 ఏళ్ల పాటు పాలించిన కన్జర్వేటివ్ పార్టీకి ఓటమి తప్పదని ఎగ్జిట్ పోల్స్ తెలుపుతున్నాయి. లేబర్ పార్టీ 410 స్థానాలు గెలుస్తుందని, కన్జర్వేటివ్ పార్టీ 131 సీట్లకు పరిమితమవుతుందని తెలిపాయి. ఈ పార్టీ నేత, భారత సంతతికి చెందిన ప్రధాని రిషి సునాక్ ఓటమి తప్పదనిపిస్తుంది. 650 స్థానాలున్న బ్రిటన్ పార్లమెంట్లో అధికారం చేపట్టడానికి 326 సీట్లు కావాల్సి ఉంటుంది. లేబర్ పార్టీ తరపున కీర్ స్టార్మర్ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. ఈక్రమంలో కీర్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. మార్పు చెందిన లేబర్ పార్టీపై నమ్మకం ఉంచిన కార్యకర్తలు, ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడిన వెంటనే సునాక్‌తో పాటు ఓటర్లు, పార్టీ అభ్యర్థులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే లేబర్ పార్టీ అధికారంలోకి వస్తే అధిక పన్నులు చెల్లించాల్సి వస్తుందని ఎన్నికలకు ముందు సునాక్ ప్రచారంలో తెలిపారు. ఇంగ్లాండ్, స్కాట్లాండ్, వేల్స్, నార్తర్న్ ఐర్లాండ్ వ్యాప్తంగా 650 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. అధికారం కోసం 326 సీట్లలో గెలుపొందాల్సి ఉంటుంది. రెండు ప్రధాన పార్టీలతో పాటు లిబరల్ డెమోక్రాట్లు, గ్రీన్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ, ఎస్‌డీఎల్‌పీ, డెమోక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ, షిన్ ఫీన్, ప్లయిడ్ కమ్రి, వర్కర్స్ పార్టీ, యాంటీ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ పార్టీతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. బ్రిటన్ కాలమానం ప్రకారం నిన్న ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. రాత్రి 10 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ నమోదైన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. కాసేపటికే కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోంది.