»Tragedy In Garba Celebrations 10 People Died Of Heart Attack
Gujarat: గర్బా వేడుకల్లో విషాదం..గుండెపోటుతో 10 మంది మృతి
గర్బా డ్యాన్స్ కార్యక్రమాలు ప్రాణాలు తీస్తున్నాయి. గత 24 గంటల్లో గర్బా డ్యాన్స్ వేస్తూ 10 మంది గుండెపోటుతో మరణించారు. ఈ మరణాల నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రత్యేక అంబులెన్స్‌లు, హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసింది.
నవరాత్రి (Navratri) సందర్భంగా గుజరాత్ (Gujarat) వ్యాప్తంగా గర్బా డ్యాన్స్ (Garbha Dance) కార్యక్రమాలు హోరెత్తుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా అట్టహాసంగా గర్బా నృత్యాలు చేస్తుంటారు. ఈ వేడుకల్లో పాల్గొన్నవారు కొందరు అక్కడికక్కడే కుప్పకూలుతుంటారు. తాజాగా ఈ గర్బా నృత్యాలు ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. అప్పటి వరకూ ఆనందంగా ఉన్న వ్యక్తులు ఒక్కసారిగా గుండెపోటు (Heartattacks)తో కుప్పకూలడంతో ఆ కుటుంబాల్లో విషాదం మిగులుతోంది.
తాజాగా గుజరాత్లో గత 24 గంటల్లో గర్బా వేడుకల (Garbha Celebrations) మధ్య 10 మంది గుండెపోటుతో మరణించారు. బాధితుల్లో టీనేజర్ల నుంచి మధ్య వయసు వారి వరకూ ఉన్నారు. బరోడాలోని ధబోయ్కు చెందిన 13 ఏళ్ల బాలుడికి గుండెపోటు వచ్చి మరణించాడు. అలాగే అహ్మదాబాద్‌కు చెందిన 24 ఏళ్ల యువకుడు గర్బా ఆడుతూ హఠాత్తుగా చనిపోయాడు. కపద్వాంజ్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు గర్బా ఆడుతూ మృతిచెందాడు.
రాష్ట్ర వ్యాప్తంగా నవరాత్రి వేడుకలు (Navratri Celebrations) మొదలైన ఆరు రోజుల్లోనే గుండె సంబంధిత సమస్యలతో 108 అంబులెన్స్ సేవల కోసం 521 కాల్స్ వచ్చినట్లు నివేదిక విడుదలైంది. అలాగే శ్వాస సంబంధిత సమస్యలతో 609 మంది అత్యవసర ఫోన్ కాల్స్ చేశారు. గర్బా వేడుకలు జరిగే సమయం అంటే సాయంత్రం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ ఈ కాల్స్ వచ్చినట్లు తెలుస్తోంది.
గర్బా వేడుకల్లో గుండెపోటు ప్రమాదాలు సంభవిస్తుండగా ప్రభుత్వం వాటిని నివారించేందుకు పలు చర్యలు చేపట్టింది. గర్బా వేడుకల సమీపంలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అలాగే గర్బా వేదికల వద్ద వైద్యులు, అంబులెన్స్‌ను ఉంచేందుకు చర్యలు చేపట్టింది. సిబ్బందికి సీపీఆర్ చేసేందుకు ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. ఇప్పటి వరకూ గర్బా నృత్యాలు చేస్తూ 10 మంది గుండెపోటుతో మరణించారు.