Medigadda
తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీ వంతెన కుంగిపోయింది. నిన్న సాయంత్రం భారీ శబ్ధం రావడంతో అధికారులు వెంటనే అప్రమత్తం అయి ఉన్నతాధికారులకు తెలిపారు. బ్యారేజీ బీ బ్లాక్‌లోని 18, 19, 20, 21 పిల్లర్ల మధ్య ఘటన జరిగిందని అధికారులు చెబుతున్నారు. బ్యారేజీ 20వ పిల్లరు కుంగడంతో పైనున్న వంతెన కూడా కుంగినట్టు అధికారులు వెల్లడించారు. ఐదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ బ్యారేజీ కుంగిపోవడం పెద్ద సంచలనంగా మారింది. వెంటనే అధికారులు వంతెనపై వాహనాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో తెలంగాణ-మహారాష్ట్ర మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఇది కూడా చూడండి: Horoscope today: నేటి రాశిఫలాలు(october 22nd 2023).. పనుల్లో విజయం
వంతెన కుంగిన సమయంలో బ్యారేజీలోకి 25 వేల క్యూసెక్కుల వరకూ ప్రవాహిస్తుంది. బ్యారేజీ వద్ద స్తంభాలను పరిశీలించేందుకు అక్కడ నిల్వ ఉన్న నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. 1632 మీటర్ల పొడవున్న ఈ లక్ష్మీ బ్యారేజీని ప్రముఖ నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ నిర్మించింది. మహారాష్ట్ర సరిహద్దు నుంచి సుమారు 356 మీటర్ల దూరంలో ఈ సంఘటన జరిగింది. ఎల్ఎండ్టీ గుత్తేదారు సంస్థ నిపుణులు కూడా అర్ధరాత్రి మేడిగడ్డకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. డ్యాం నిర్వహణ గుత్తేదారు పరిధిలోనే ఉన్నందున ఏవైనా మరమ్మతులు అవసరమైతే చేస్తామని ఇంజినీర్ ఇన్ చీఫ్ (రామగుండం) నల్లా వెంకటేశ్వర్లు తెలిపారు. గతేడాది 29 లక్షల క్యూసెక్కుల వరదను ఈ డ్యాం ఎదుర్కొంది. అప్పుడు రాని శబ్దాలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయో పరిశీలిస్తామని అధికారులు వెల్లడించారు. ఈ బ్యారేజీ సామర్థ్యం 16.1 టీఎంసీలు.
ఇది కూడా చూడండి: Telangana : ఎన్నికల వేళ తనిఖీలు.. రూ.300కోట్ల సొత్తు స్వాధీనం

