Afghanistan: కుదిపేసిన భూకంపాలు..320 మంది దుర్మరణం
వరుస భూకంపాలు 320 మందిని పొట్టనబెట్టుకున్నాయి. అరగంటలోనే పశ్చిమ ఆఫ్గాన్ మొత్తం చెల్లాచెదురైంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఐక్యరాజ్యసమితి తెలిపింది.
అఫ్గానిస్థాన్ (Afghanistan)ను శనివారం అరగంట పాటు భారీ భూ ప్రకంపనలు (Earthquakes) సంభవించాయి. పశ్చిమ ఆఫ్గాన్‌లో 6.3 తీవ్రతతో సంభవించిన ఈ భూకంపం వల్ల 320 మంది దుర్మరణం చెందారు. వందలాది మంది గాయాలపాలయ్యారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. భూకంపం వల్ల పలుచోట్ల కొండచరియలు విరిగిపడటంతో భారీ ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది.
ఈ ఘటనలో అనేక భవనాలు కుప్పకూలాయని, కూలిపోయిన భవనాల కింద పలువురు చిక్కుకుని ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరగవచ్చని హేరాట్ ప్రావిన్స్‌కు చెందిన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ మహమ్మద్ తాలేబ్ షాహిద్ వెల్లడించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఏర్పడిన ప్రకంపనల వల్ల ఇండ్లు, కార్యాలయాలు వదిలి ప్రజలు భయంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.
హేరాట్ నగరానికి వాయవ్యంగా 40 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నట్టు అమెరికా జియలాజికల్ సర్వే తెలిపింది. 5.5, 4.7, 6.3, 5.9, 4.6 తీవ్రతతో ఐదుసార్లు భూకంపాలు సంభవించాయి. గత ఏడాది జనవరిలో కూడా భారీ భూకంపం ఏర్పడటం వల్ల 1000 మంది మృతి చెందగా, వేలాది మంది గాయాలపాలయ్యారు.