గ్రామ అభివృద్ధి కోసం అప్పులు చేసి మరీ పనులు చేస్తే ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేసింది. బిల్లులు పెండింగ్ లో ఉండడంతో తాము చేసిన అప్పులకు వడ్డీ భారీగా పెరుగుతోందని వాపోయింది. అధికారులకు ఎన్ని సార్లు మొర పెట్టుకున్న వినడం లేదనే ఆవేదనతో మహిళా సర్పంచ్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్ లో చోటుచేసుకుంది.
నందిపేట్ గ్రామ సర్పంచ్ గా సాంబార్ వాణి ఎన్నికైంది. సర్పంచ్ గా ఎన్నికైనప్పటి నుంచి గ్రామం బాగు కోసం పని చేసింది. ఈ సందర్భంగా డబ్బులు లేకున్నా అప్పులు చేసి మరీ గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టింది. డబ్బులు ఇవాళ కాకుంటే రేపు వస్తాయి కానీ తన పదవికి న్యాయం చేయాలని కష్టపడి పని చేసింది. అయితే చేసిన పనులకు ఏళ్లు గడుస్తున్నా డబ్బులు రావడం లేదు. బిల్లులు పెడితే వాటికి ఇంకా చెల్లింపులు జరగడం లేదు. సంవత్సరాలు గడుస్తున్నా చెల్లించకపోవడంతో తాను చేసిన అప్పులకు వడ్డీ ఊహించని రీతిలో పెరిగిపోయింది. రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు చేయగా.. దానికి వడ్డీ రూ.4 కోట్లు పెరిగిందని వాపోయింది.
ప్రభుత్వం ఇక బిల్లులు చెల్లించడం లేదని.. తనకు చావే దిక్కు అని పెట్రోల్ సీసాతో కలెక్టరేట్ కు చేరుకుంది. భర్త తిరుపతితో కలిసి కలెక్టరేట్ లో వాణి ఆత్మహత్యకు పాల్పడింది. పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంటుండగా కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది నివారించారు. అగ్గిపెట్టెను లాక్కోవడంతో ప్రమాదం తప్పింది. తమకు బిల్లులు రాకుండా ఉప సర్పంచ్, వార్డు సభ్యులు అడ్డుకుంటున్నట్లు సర్పంచ్ వాణి ఆరోపించింది. ప్రభుత్వం వెంటనే స్పందించి బిల్లు చెల్లించాలని డిమాండ్ చేసింది. లేకుంటే తమకు చావే దిక్కని వాణి వాపోయింది.