విక్టరీ వెంకటేష్ నటించిన దృశ్యం సినిమా చూడనివారు ఎవరూ ఉండరు. ఈ సినిమాలో వెంకటేష్ ఓ మర్డర్ చేసి.. పోలీసులకు చిక్కకుండా చాలా ప్రయత్నాలే చేస్తాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దీనికి ఇటీవల సీక్వెల్ కూడా తీశారు. కాగా… ఇప్పుడు ఈ సినిమాని ఆదర్శంగా తీసుకొని ఓ యువతి తన తల్లితో కలిసి తండ్రిని చంపేశారు. కర్ణాటకలో జరిగిన సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కర్ణాటకలోని బెళగావికి చెందిన భూవ్యాపారి సుధీర్ కాంబళె గతంలో దుబాయ్‌లో పని చేసేవాడు. కరోనా సమయంలో బెళగావిలోని క్యాంప్ ఏరియాలో ఉంటూ భూవ్యాపారాన్ని తిరిగి ప్రారంభించాడు. సుధీర్, రోహిణిల కుమార్తె స్నేహ. మహారాష్ట్రలోని పుణెలో ఒక కళాశాలలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నప్పుడు ఆమెకు అక్షయ్ విఠకర్ పరిచయమయ్యాడు. వారి ప్రేమ విషయాన్ని సుధీర్ ఇటీవల గుర్తించి కుమార్తెను మందలించాడు. దీంతో తండ్రి అడ్డు తప్పించాలని ఆమె భావించి విషయాన్ని తల్లికి చెప్పగా.. హత్యను ఆమె ప్రోత్సహించింది.
తన ప్రియుడ్ని పుణె నుంచి బెళగావికి సెప్టెంబరు 15న పిలిపించిన స్నేహ.. పథకం ప్రకారం ఓ లాడ్జిలో ఉంచింది. తండ్రి ఇంటి పై అంతస్తులో నిద్రిస్తున్నప్పుడు 17న ఉదయం అక్షయ్‌ను తల్లీబిడ్డలు ఇంటికి పిలిపించారు. సుధీర్ కాళ్లు చేతులను వారిద్దరూ పట్టుకోగా.. ఆయన కడుపు, గొంతు, చేతులు, మొహంపై ఓ కత్తితో అక్షయ్ ఇష్టానుసారం పొడిచాడు. సుధీర్ మరణించారని ధ్రువీకరించుకున్నాక అక్షయ్ పుణెకు వెళ్లిపోయాడు.
తన భర్తను ఎవరో హత్య చేసి పరారయ్యారని రోహిణి ఇచ్చిన ఫిర్యాదుతో డీసీపీ రవీంద్ర దర్యాప్తు చేపట్టా రు. విచారణలో ఎలా అడిగినా.. వారిద్దరూ ఒకే రకమైన సమాధానాలిచ్చారు. అనుమానంపై తల్లీకుమార్తెల ఫోన్‌కాల్స్‌ను పోలీసులు పరిశీలించారు.
స్నేహ క్రమం తప్పకుండా అక్షయ్‌తో మాట్లాడుతున్నట్లు గుర్తించారు. ఆపై విచారణలో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.హత్యను ప్రోత్సహించిన ఆమె తల్లి అయిన రోహిణి కాంబళె, ఆమె ప్రియుడు అక్షయ విఠకర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. హత్య తామే చేశామని ఒప్పుకున్నారు. అయితే.. తాము దృశ్యం సినిమా చూసి ఈ నేరం చేశామంటూ వారు అంగీకరించడం గమనార్హం.