సినిమా తారలకు, క్రికెటర్లకు అభిమానులు ఉండటం సర్వసాధారణం. అయితే… ఆ అభిమానం వెర్రితనం గా మారితే మాత్రం… సెలబ్రెటీలు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తాజాగా.. తమిళనాడులో జరిగిన ఓ సంఘటన విరాట్ కోహ్లీని చిక్కుల్లో పడేసింది.
ఇంతకీ మ్యాటరేంటంటే… టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అభిమానిని మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిమాని కొట్టి చంపాడు. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. క్రికెట్ అభిమానులైన ఇద్దరు స్నేహితులు పూర్తిగా మద్యం సేవించి మత్తులో మునిగారు. ఆ ఇద్దరిలో ఒకరు రోహిత్ అభిమాని అయితే, రెండో వాడు విరాట్ అభిమాని. వీరిద్దరిలో ఎవరు గొప్ప అనే వాదనకు దిగారు. మాటా మాటా పెరిగి తగాదాకు దారితీసింది. కొట్టుకునే వరకు వెళ్లింది. చివరి ఇద్దరిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వ్యక్తి 24 ఏళ్ల విగ్నేష్ అని తేలింది. దాడికి దిగి విగ్నేష్‌ను చంపిని వ్యక్తి ధర్మరాజు అని తేలింది. వీరిద్దరూ కూడా తమిళనాడులోని అరియాలుర్ జిల్లాలోని పొయ్యూరు గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.
ముందు ఒక గాజు సీసాతో తలపై గట్టిగా కొట్టిన ధర్మరాజు ఆ తర్వాత క్రికెట్ బ్యాట్‌తో విగ్నేష్ తల పగులకొట్టాడు. ఆ దెబ్బలకి విగ్నేష్ అక్కడి కక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ దుర్ఘటన సిడ్కో పారిశ్రామిక వాడలో జరిగింది. ఆ తర్వాతి రోజు అటుగా వెళుతున్న కొందరు శవాన్ని చూసి పోలీసులకు తెలియజేశారు. రంగంలో దిగిన పోలీసులు విచారణ చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారు.
చనిపోయిన విగ్నేష్ మరి కొన్ని రోజుల్లో సింగపూర్ వెళ్లనున్నాడు. వర్క్ వీసా కోసం ఎదురుచూస్తున్నాడు. ఈలోగా ఈ దారుణం జరిగింది.
చనిపోయిన వ్యక్తి ముంబై ఇండియన్స్ జట్టుకు ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వీరాభిమాని. అతడిని చంపిన వ్యక్తి రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్‌కు, విరాట్ కోహ్లీ వీరాభిమాని. దీంతో సోషల్ మీడియాలో కోహ్లీపై నెగెటివ్ కామెంట్లు రావడం మొదలయ్యాయి. అరెస్ట్ కోహ్లీ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండింగ్‌గా మారింది. విరాట్ కోహ్లీని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.