ఎమ్మెల్యే స్టిక్కర్ ఉంటే కారు స్పీడ్‌కు లిమిట్ ఉండదా? వేగంగా దూసుకెళ్లే అనుమతి ఎవరు ఇస్తారు. అది రద్దీగా ఉండే రోడ్ల మీద. చివరకు సామాన్యుల ప్రాణాలే గాల్లో కలిసిపోతున్నాయి. తాజాగా బెంగళూరులో అదే జరిగింది. వేగంగా దూసుకెళ్లిన ఓ కారు ఇద్దరు ప్రాణాలను బలిగొన్నది. ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకొని ఉన్న కారు నగరంలోని రోడ్ల మీద వేగంతో దూసుకెళ్లింది. చివరకు ఒక సిగ్నల్ దగ్గర ఆగకుండా ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ముందు ఉన్న వాహనాలలోని వ్యక్తులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
కారు డ్రైవర్ మోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే హర్తాలు హలప్ప అనే పేరుతో ఉన్న స్టిక్కర్ కారుకు అంటించి ఉంది. కానీ.. అది ఆ ఎమ్మెల్యేకు చెందిన కారు కాదు. అలాగే.. ఆ ఎమ్మెల్యే కూడా ఆ కారులో లేరు. అది రిటైర్ అయిన ఫారెస్ట్ ఆఫీసర్ కారు అని పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యే కూతురు సుష్మిత హలప్పా మామయ్య ఆయన. అందుకే ఎమ్మెల్యే స్టిక్కర్‌ను కారుకు అంటించారు. ఏది ఏమైనా.. ఇద్దరు వ్యక్తుల ప్రాణాలను అతి వేగం బలి తీసుకుంది. సిగ్నల్ వద్ద బైక్ పై ఆగి ఉన్న ఇద్దరు వ్యక్తులు మరణించారు. మరో రెండు కార్లు, మూడు బైకులు ఈ ప్రమాదంలో దెబ్బతిన్నాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.