ఆయుర్వేదిక్ సిరప్ (Ayurvedic Syrup) తాగి ఐదుగురు మరణించిన ఘటన గుజరాత్ (Gujarat)లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయుర్వేదిక్ టానిక్‌లో విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. ఐదుగురు చికిత్స పొందుతూ మృతిచెందడంతో ఖేడా జిల్లాలోని బిలోదర గ్రామంలో విషాదచాయలు అలముకున్నాయి.
బిలోదర (Bilodara) గ్రామానికి చెందిన ఓ ఆయుర్వేదిక్ షాప్ వ్యక్తి ‘కల్మేఘాసన్-అసవ అరిష్టా’ అనే బ్రాండ్‌తో ఉన్న ఆయుర్వేద టానిక్‌ను సుమారు 50 మందికి అమ్మాడు. ఆ సిరప్ తాగడం వల్ల రెండు రోజుల్లో ఐదుగురు మృత్యువాత (5 died) పడ్డారు. టానిక్ తాగడం వల్ల తీవ్ర అస్వస్థతకు గురై మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఆయుర్వేదిక్ సిరప్ (Ayurvedic Syrup) అమ్మిన వ్యక్తితో పాటుగా మరో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. ఆయుర్వేద టానిక్ తాగిన ఓ వ్యక్తి రక్త నమూనాలను పరిశీలించామని, విషపూరితమైన మిథైల్ ఆల్కహాల్ ఆ సిరప్‌లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించినట్లు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు (Case File) చేసుకున్న పోలీసులు మరికొందరిని విచారిస్తున్నారు.