»658 Sim Cards With A Single Photo Police Registered A Case
Vijayawada: ఒకే ఫోటోతో 658 సిమ్ కార్డులు..పోలీసులు కేసు నమోదు
ఓ వ్యక్తికి 658 సిమ్ కార్డులున్నాయి. ఈ విషయాన్ని టెలికమ్యూనికేషన్ అధికారులు పోలీసులకు తెలిపారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి మోసాలకు పాల్పడేవారిని వదిలిపెట్టేది లేదని హెచ్చరించారు.
ఓ వ్యక్తి ఒకటి లేదా రెండు సిమ్ కార్డులు (Sim Cards) ఉండటం సహజమే. మహా అయితే మూడు సిమ్ కార్డులు ఉండొచ్చు. కానీ ఇక్కడొక వ్యక్తికి మాత్రం 658 సిమ్ కార్డులున్నాయి. విజయవాడలోని గుణదలలో ఒకే ఫోటోతో 658 సిమ్ కార్డులు జారీ అయినట్లు టెలికమ్యూనికేషన్స్ (Telecommunications) అధికారులు గుర్తించారు. ఈ విషయంలో కమిషనర్ కాంతిరాణాకు డాట్ సంస్థ ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై సత్వరమే విచారణ చేపట్టాలని కమిషనర్ అధికారులకు ఆదేశాలిచ్చారు.
విచారణలో పోలీసులకు షాకింగ్ నిజాలు తెలిశాయి. ఓ నెట్వర్క్ సంస్థకు చెందిన 658 సిమ్ కార్డులను ఒకే ఫోటోతో ఉన్న వ్యక్తికి అమ్మినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. కొనుగోలు చేసిన వ్యక్తి సత్యనారాయణపురానికి చెందిన పోలుకొండ నవీన్ అని తేలింది. అలాగే అజిత్ సింగ్ నగర్, విస్సన్నపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 150 పైగా సిమ్ కార్డులు డూప్లికేట్ ప్రూఫ్ (Duplicate proofs)తో రిజిస్టర్ అయినట్లు అధికారులు గుర్తించారు.
సిమ్ కార్డు(Sim Cards) మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు టెలికమ్యూనికేషన్ శాఖ సాంకేతికతతో ముందుకు సాగుతోంది. ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఫేసియల్ రికగ్నేషన్ పవర్డ్ సొల్యూషన్ ఫర్ టెలికాం సిమ్ సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్ అనే టూల్‌తో ఇటువంటి విషయాలను తెలుసుకుంటున్నారు. ఆ టూల్లో ఉన్న ప్రోగ్రాం సిమ్ కార్డు మోసాలను గుర్తిస్తుంది.
మోసపూరిత సిమ్ కార్డుల(Sim Cards)ను బ్లాక్ లిస్ట్‌లో ఉంచుతుంది. అదేవిధంగా టెలికాం ఆపరేటర్ల నుంచి సిమ్ కార్డు తీసుకున్నవారి డేటాను కూడా సేకరిస్తుంది. ఆ తర్వాత ఒకే ఫోటోతో ఉన్న సిమ్ కార్డుల వివరాలను ఫిల్టర్ చేస్తుంది. దీని వల్ల అత్యధికంగా సిమ్ కార్డులుండేవారి బాగోతం బయటపడుతుందని పోలీసులు వెల్లడించారు. సిమ్ కార్డుల విషయంలో మోసాలకు పాల్పడితే వదిలేది లేదని వారు హెచ్చరించారు.