ఓడ ప్రమాదం (Boat Accident)లో 41 మంది మృతిచెందిన ఘటన ఇటాలియన్ ద్వీపంలో చోటుచేసుకుంది. సెంట్రల్ మెడిటరేనియన్ ప్రాంతంలో వలసదారులు మరణించారు. మరికొందరు ఈ ప్రమాదం నుంచి బయటపడి లాంపెడుసా అనే ప్రాంతానికి చేరుకున్నారు. ఓడ నుంచి నలుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలతో సహా 45 మంది మరణించినట్లు రెస్క్యూ సిబ్బంది వెల్లడించారు.
ట్యునీషియాలోని స్పాక్స్ ప్రాంతం నుంచి పడవ బయల్దేరింది. ఆ తర్వాత కొన్ని గంటలకే ఆ పడవ బోల్తా పడి మునిగిపోయినట్లు ప్రాణాలతో బయటపడినవారు తెలిపారు. ఐవరీ కోస్ట్, గినియాకు చెందిన ముగ్గురు పురుషులు, ఓ మహిళ ప్రాణాలతో బయటపడ్డారు. అయితే కోస్ట్ గార్డ్ వివరాల మేరకు రెండు పడవలు మునిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదాల్లో 57 మంది వరకూ మృతిచెందారని, సుమారుగా 30 మంది తప్పిపోయారని తెలిపారు. రెండు మృతదేహాలను తాము స్వాధీనం చేసుకున్నామన్నారు.
ప్రతి ఏడాది ఓడ ప్రమాదా(Boat Accidents)ల్లో చాలా మంది వలసదారులు మరణిస్తున్నారు. అంతర్గత మంత్రిత్వ శాఖ వివరాల ప్రకారం.. 2022లో సముద్రం ద్వారా 44,700 మంది వలస వచ్చారు. అయితే ఇప్పటి వరకూ ఇటలీ(Italy)కి 93,700 మంది వలస వచ్చినట్లు అధికారిక గణాంకాలు వెలువడ్డాయి.