మహబూబాబాద్ మండలం సండ్రాలగూడెం శివారు పూరి తండాలో శుక్రవారం విషాదం చోటుచేసుకుంది. మొక్కజొన్న పంటకు నీరు పెట్టేందుకు విద్యుత్ మోటార్ స్విచ్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి బానోత్ లక్ష్మి (55) అనే గిరిజన మహిళా రైతు అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
GDWL: గద్వాల మున్సిపల్ కార్యాలయంలో ఇవాళ నూతన మున్సిపల్ ఛైర్‌పర్సన్ తుమ్మల జయలక్ష్మి బాధ్యతలు చేపట్టారు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో ఆమె అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పట్టణ సమగ్ర అభివృద్ధికి చిత్తశుద్ధితో పని చేస్తానన్నారు. ఎమ్మెల్యే సహకారం, కౌన్సిలర్ల సమన్వయంతో ప్రజల సమస్యలను పరిష్కరించడంలో తన వంతు కృషి చేస్తానన్నారు.
BHNG: బీబీనగర్ మండలం రహీంఖాన్‌గూడెంలో శ్రీ పద్మావతి అలివేల్ మంగ సమేత వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం తెల్లవారుజామున స్వామి వారు దివ్య విమాన రథోత్సవం ద్వారా గ్రామ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు హారతులు, భక్తిశ్రద్ధలతో స్వాగతించారు.
NZB: జిల్లా న్యాయవాదుల సహకార పరపతి సంఘం సంయుక్త కార్యదర్శి గంట విప్లవ్ కిరణ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్ బార్ అసోసియేషన్ హాలులో 2026 సంవత్సర కాలమాణిని విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జక్కుల శ్రీధర్, ప్రధాన కార్యదర్శి జెస్సు అనిల్ కుమార్, న్యాయవాదులు పాల్గొన్నారు.
BDK: చర్ల BRS పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం మండల కన్వీనర్ దొడ్డి తాతారావు అధ్యక్షతన ఇవాళ జరిగింది. భద్రాచలం నియోజకవర్గం సీనియర్ నాయకులు మానే రామకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.. రేపు రాబోయే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల్లో మన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించి కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
JN: బచ్చన్నపేట మండలం లింగంపల్లి చెందిన బొడ్డు ప్రవీణ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తన అభిమానాన్ని వినూత్నంగా చాటుకున్నారు. జగన్ మరోసారి సీఎం కావాలని కోరుతూ తెలంగాణ వ్యాప్తంగా 100 దేవాలయాల్లో మోకాళ్లపై నడుస్తూ ప్రతి ఆలయంలో 100 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. శుక్రవారం కొడవటూరు సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించాడు.
MNCL: మందమర్రి ఏరియాలో 90 మంది అవుట్ సోర్సింగ్ సెక్యూరిటీ గార్డుల కేటాయింపు కోసం నిర్వహించిన టెండర్లలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని CPI పట్టణ కార్యదర్శి దుర్గరాజ్ శుక్రవారం ఆరోపించారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి అర్హత లేని సంస్థలకు టెండర్లు కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ESI, PF బిల్లులు పరిశీలించాలన్నారు.
KMM: తెలంగాణ ఉద్యమకారుడు బత్తుల సోమయ్య గౌడ్-పంకజం దంపతులు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కూసుమంచి మండలం లోక్యాతండా వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు భవానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం తెలుసుకున్న మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ స్పందించి శుక్రవారం ఆస్పత్రికి వెళ్లి సోమయ్య-పంకజం దంపతులను పరామర్శించారు.
SRCL: తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో దివ్యాంగుల సంక్షేమ పథకంలో భాగంగా ఉచిత ద్విచక్ర వాహనాలు పంపిణీ చేశారు. మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ లబ్ధిదారులకు వాహనాలు అందజేశారు. ఇల్లంతకుంట మండలం నర్సక్కపేటకు చెందిన ర్యాగటి శ్రీనివాస్, ర్యాగటి శ్రవణ్ వాహనాలు పొందారు. దివ్యాంగుల ఉపాధి, ప్రయాణ సౌకర్యానికి ఇవి ఉపయోగపడతాయని ఎమ్మెల్యే తెలిపారు.
RR: మహేశ్వరం నియోజకవర్గం, బడంగ్‌పేట్ సర్కిల్‌లో గ్రేటర్ HYD మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) అధికారులతో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. పెండింగ్ పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. GHMC శంషాబాద్ జోనల్ కమిషనర్, బడంగ్పేట్ డిప్యూటీ కమిషనర్ పాల్గొన్నారు.
PDPL: మంథని రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఇవాళ దాడి చేశారు. సబ్ రిజిస్ట్రార్ కాసర్ల రాజేందర్, ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ రషీద్‌తో కలిసి పుట్టపాకకు చెందిన రైతు వద్ద రూ. 16,500 ప్లాట్ రిజిస్ట్రేషన్ కోసం తీసుకుంటుండగా ACB DSP మధు ఆధ్వర్యంలో వలపన్ని పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి, అరెస్టు చేశారు.
SRCL: ప్రతి వర్గానికి సమానహక్కులు, అవకాశాలు న్యాయం అందించాలని లోక్ అదాలత్ సభ్యులు ఆడెపు వేణు పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలో రాజనీతి శాస్త్ర విభాగం సహకారంతో ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవంను నిర్వహించారు. అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సును నిర్వహించారు.
KNR: తిమ్మాపూర్ మండలం రేణుగుంట టోల్ ప్లాజా వద్ద వినూత్న రీతిలో నిరసన తెలిపారు. కోట శ్యాం కుమార్ ప్లకార్డ్ పట్టుకుని నిరసన చేపట్టారు. వాహనం కొనుగోలు చేసినప్పుడే లైఫ్ ట్యాక్స్ కట్టానని, అయినా టోల్ ప్లాజాలు ఏర్పాటు చేసి ట్యాక్స్ వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే టోల్ ప్లాజాలు తొలగించాలని డిమాండ్ చేశారు.
ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని రైతుల విజ్ఞప్తి మేరకు CCI ద్వారా పత్తి కొనుగోలు గడువును మార్చి 20 వరకు పొడిగించాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇంఛార్జి అజ్మీరా శ్యామ్ నాయక్ కోరారు. ఈ మేరకు శుక్రవారం మార్కెట్ కమిటీ ఛైర్మన్ మంగతో కలిసి కలెక్టర్ కె. హరితని కలిసి విజ్ఞప్తి చేశారు. రైతుల విజ్ఞప్తిపై జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించారని శ్యామ్ నాయక్ తెలిపారు.
ASF: జిల్లాలో ఎండలు మొదలయ్యాయి. ఓ వైపు ఉదయం చలి ఉంటూనే మధ్యాహ్నం ఎండలు దంచి కొడుతుండటంతో జిల్లా ప్రజలు కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఆసిఫాబాద్లో శుక్రవారం 32 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదయింది. అయితే, వేసవి ప్రారంభంలోనే ఇలా ఉంటే ఏప్రిల్, మేలో పరిస్థితి ఏంటని జిల్లా ప్రజలు ఆందోళన చెందుతున్నారు.