ADB: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈనెల 24 మంగళవారం జిల్లాకు రానున్నట్లు బోథ్ ఎమ్మెల్యే కార్యవర్గాలు తెలిపాయి. ఇటీవల అరెస్ట్ అయిన ఆదిలాబాద్ జిల్లా జైలులో ఉన్న మంచిర్యాల జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ను ఆయన పరామర్శించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు.
KNR: కొత్తపల్లి 17వ డివిజన్ కార్పొరేటర్ వేముల కవిత చంద్రశేఖర్ తన ఎన్నికల హామీని నెరవేర్చి నిబద్ధతను చాటుకున్నారు. 17వ డివిజన్‌కు చెందిన సిరిపురం స్వప్న మురళి కుమార్తె వివాహానికి హాజరైన ఆమె ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం రూ. 10,016 నగదును ఆడబిడ్డ కట్నంగా అందజేశారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తన ధ్యేయమని ఈ సందర్భంగా కవిత పేర్కొన్నారు.
HNK: వేలేరు గ్రామంలో “శ్రీవల్లీ జీరాక్స్ & ఆన్‌లైన్ సర్వీసెస్” నూతన షాప్‌ను ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ జంగా రాఘవరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. గ్రామ ప్రజలకు జీరాక్స్, ప్రింటింగ్, ఆన్‌లైన్ సేవలు, లామినేషన్, స్పైరల్ బైండింగ్ వంటి సౌకర్యాలు ఒకే చోట అందుబాటులోకి రావడం ఆనందకరమని ఛైర్మన్ రాఘవరెడ్డి తెలిపారు
JGL: సీఎం కప్ సెకండ్ ఎడిషన్లో భాగంగా హన్మకొండలో జరుగుతున్న పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి హ్యాండ్బాల్ స్పోర్ట్స్‌కు ఎంపికైన క్రీడాకారులు సిద్ధమయ్యారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి సెలెక్ట్ అయిన క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. మొత్తం 62 ఈ వెంట్లలో 1,648 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు.
NLG: చౌటుప్పల్ సమీపంలోని బోర్రోల గూడెం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జగ్గయ్యపేట నుంచి సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీ, నిలిపి ఉన్న మరో లారీని బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో దేవరకొండకు చెందిన డ్రైవర్ మల్లయ్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
MBNR: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర గ్రామంలో చాకలి కులస్తులపై రెడ్డీ కులస్తులు చేసిన దాడిని ఖండిస్తూ రజక సంఘంతో పాటు వివిధ ప్రజా కుల సంఘాలు కలిసి మహబూబ్‌నగర్ పట్టణంలోని తెలంగాణ చౌరస్తాలో నిరసన చేశారు. ఈ మేరకు రజక సంఘం జాతీయ నేత నడి మింటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. సభ్య సమాజం తలదించుకునేలా జరిగిన ఈ అమానుష సంఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
NZB: తెలుగు రాష్ట్రాల కాంగ్రెస్ డీసీసీ అధ్యక్షుల 10 రోజుల శిక్షణ శిబిరంలో నిజామాబాద్ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. నగరంలో పార్టీ బలోపేతానికి చేపట్టిన చర్యలను వివరించారు. నిజామాబాద్ కార్పొరేషన్ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకునేలా రూపొందించిన వ్యూహాలను, భవిష్యత్తు కార్యచరణను వివరించారు. పార్టీని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
RR: శంషాబాద్‌లో ముదిరాజ్ కమ్యూనిటీ నూతన భవనాన్ని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ భవనం కమ్యూనిటీ అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు. ఆయనతో పాటు రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ డా. బండ ప్రకాష్, ఎమ్మెల్యే టీ. ప్రకాశ్ గౌడ్ పాల్గొన్నారు.
NZB: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆదివారం BJP జిల్లా కార్యాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. మన్ కీ బాత్” అంటే దేశ ప్రజలతో ప్రధాన మంత్రి ప్రత్యక్ష సంభాషణ వేదిక అని అన్నారు.
పెద్దపల్లి పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే విజయరమణారావు పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని 22వ వార్డులో కమాన్ నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. దశలవారీగా పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఉప్పు స్వరూప, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
KMR: లయన్స్ క్లబ్ ఇంటర్‌నేషనల్ (2024-25) అవార్డుల వేడుకలో పిట్లం లయన్స్ క్లబ్ విశేష ప్రతిభ కనబరిచి ఉత్తమ క్లబ్ పురస్కారాన్ని దక్కించుకుంది. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు వ్యక్తిగత అవార్డులను కూడా అందుకున్నారు. ఉత్తమ అధ్యక్షుడిగా కాశిరెడ్డి, ఉత్తమ మండలాధ్యక్షుడిగా కిషన్ ఎంపికయ్యారు. వీరితో పాటు సంజీవరెడ్డి, వేణుగోపాల్ తమసేవా కార్యక్రమాలకు అవార్డులు అందుకున్నారు.
NLG: ఉరుమడ్లలో ముత్యాలమ్మ, మారమ్మ దేవాలయాల నూతన నిర్మాణ పనులకు తెలంగాణ డెయిరీ కార్పోరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ భానుశ్రీ, నాయకులు దేవేందర్ రెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక అభివృద్ధికి కృషి చేస్తున్న అమిత్ రెడ్డిని గ్రామ ప్రజలు అభినందించారు.
MHBD:మహబూబాబాద్ మండలం రెడ్యాల గ్రామానికి ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెలికాప్టర్ ద్వారా చేరుకుని వెన్నం రాఘవేందర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీఎం వెంట మంత్రులుఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
KNR: గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను ముప్పుతిప్పలు పెడుతూ, ఇండ్లపైకి చేరి బెంబేలెత్తిస్తున్న వానరాలను తరమడానికి శంకరపట్నం మండలం కరీంపేట గ్రామపంచాయతీ పాలకవర్గం వినూత్నంగా ఆలోచించి ఎలుగుబంటి డ్రెస్, మాస్క్‌ను తెప్పించింది. వాటిని ఓ వ్యక్తికి ధరింపజేసి గ్రామంలోని పలు వార్డులలో తిప్పుతూ కోతులను తరిమివేశే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ADB: గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్ వద్ద ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆదివారం ముమ్మరంగా వాహనాల తనిఖీలు చేపట్టారు. వాహన పత్రాలను పరిశీలించి, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. ఎస్సై మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, లైసెన్స్ కలిగి ఉండాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని హెచ్చరించారు.