HYD: త్రిబుల్ ఐటీ HYDలో అందుబాటులోకి తీసుకొచ్చిన దృష్టి లైబ్రరీ విశేష ఫలితాలు ఇస్తోందని ప్రొఫెసర్ జవహర్ తెలిపారు. తెలుగు, హిందీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ వంటి మొత్తం 12 భాషల్లో ఈ లైబ్రరీ అందుబాటులో ఉంది. బ్రెయిలీ లిపి, ఆడియో బుక్ రూపాల్లో పీజీ స్థాయి వరకు పాఠ్యాంశాలు అందించడం ద్వారా దృష్టి లోపం ఉన్న విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది.
PDPL: ఇటీవల గని ప్రమాదంలో గాయపడి సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్మికుడు లక్ష్మీనారాయణను సంస్థ CMO డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా వైద్య బృందం చికిత్స వివరాలు సేకరించారు. వివరాలు కొత్తగూడెం ఆసుపత్రికి పంపించి, తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఈ మేరకు బాధితుడికి న్యాయం జరిగేలా చూస్తామని పేర్కొన్నారు.
MNCL: రాష్ట్ర ప్రభుత్వం రూ.51వేల కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వలన సింగరణి కార్మికులకు వేతనాలు చెల్లించలేని పరిస్థితులు వస్తున్నాయని AITUC అధ్యక్షుడు సీతారామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. AITUC ఆధ్వర్యంలో చేపట్టిన ‘సేవ్ సింగరేణి జాత’ బెల్లంపల్లికి వచ్చిన సందర్భంగా బహిరంగ సభలో మాట్లాడారు.అధికారుల స్వార్థం కొరకు సంస్థను నష్టాలపాలు చేస్తున్నారని ఆరోపించారు.
KNR: రాష్ట్ర బడ్జెట్‌లో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. ఈసారి రూ. 17,907 కోట్లను కేటాయించగా, మున్సిపాలిటీలకు రూ.5,000 కోట్లు, కార్పొరేషన్లకు రూ.754 కోట్లు కేటాయించారు. జమ్మికుంట పట్టణంలో ఉపఎన్నికల సమయంలో ప్రారంభించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయింది. దీంతో స్థానిక వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ADB: మానసిక ఒత్తిడితో బాధపడుతున్న రైతులు, వారి కుటుంబసభ్యులు ప్రభుత్వం అందిస్తున్న టెలీ-మానస్ (Tele-MANAS) హెల్ప్ లైన్ 14416 సేవలను వినియోగించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఈ నంబర్‌కు కాల్ చేసి నిపుణులైన కౌన్సిలర్ల ద్వారా ఉచిత సలహాలు పొందవచ్చని తెలిపారు. గ్రామ స్థాయిలో ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు ఈ సేవలపై అవగాహన కల్పిస్తున్నారని పేర్కొన్నారు.
NRML: కుబీర్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ప్రభుత్వ రంగ సంస్థ (మార్క్ ఫెడ్) ఆధ్వర్యంలో PACS ద్వారా ఆదివారం నుంచి శనగల కొనుగోలు కేంద్రం ప్రారంభించనున్నట్లు AMC ఛైర్మన్ గోనె కళ్యాణ్, PACS కార్యదర్శి క్రాంతి కుమార్ తెలిపారు. MLA రామారావు పటేల్ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారన్నారు. ఈ మేరకు రైతులు కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
MNCL: స్నేహితుల మధ్య జరిగిన గొడవలో దీపక్ అనే యువకుడు దాడికి గురై శనివారం చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ ప్రమోద్ రావు తెలిపారు. కూలి పని చేసుకునే సిడం దీపక్, సంజీవ్‌లు కాలేజీ రోడ్డులో అద్దెకు ఉంటున్నారు. 2 రోజుల క్రితం జరిగిన గొడవలో దీపక్‌పై రాడ్‌తో దాడి చేయడంతో గాయాలపాలయ్యాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.
KNR: చిగురుమామిడి మండలం చిన్నముల్కనూర్ వద్ద విధుల్లో ఉన్న లస్కర్ తడిగొప్పుల మల్లయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. రాత్రి కాల్వ వద్ద తోటి సిబ్బందితో కలిసి నిద్రించిన ఆయన, తెల్లవారేసరికి విగతజీవిగా కనిపించారు. మృతుని కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేషియా, ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని బంధువులు డిమాండ్ చేశారు.
JGL: ప్రేమ పెళ్లి చేసుకుని భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించగా బాధితురాలు చికిత్స పొందుతూ మరణించింది. ధర్మపురికి చెందిన బడుగు నవీన్, మసీదు రమ్య (22) నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకోగా, గొడవల వల్ల 5 నెలలుగా రమ్య తన తల్లి వద్ద ఉంటోంది. ఈ నెల 16న అక్కడికి వెళ్లిన నవీన్ ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. వరంగల్ MGMలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది.
SRCL: వేములవాడ మున్సిపల్ పరిధిలోని 4వ వార్డులో కూలిపోయిన సీసీ రోడ్డును శనివారం సాయంత్రం మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు పరిశీలించారు. గత కొద్ది రోజుల క్రితం సీసీ రోడ్డు కూలిపోవడంతో ఈ విషయమై స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ ఛైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన పరిశీలించి, మరమ్మతు చేపట్టాలని అధికారులకు సూచించారు.
నల్గొండలోని దొడ్డి కొమరయ్య భవనంలో ప్రజానాట్యమండలి జిల్లా కమిటీ సమావేశం ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రమౌళి అధ్యక్షతన జరిగింది. ఈ మేరకు రాష్ట్ర నాయకుడు నాగార్జున మాట్లాడుతూ.. ప్రజా కలల పరిరక్షణ కోసం ఉద్యమించాలని అన్నారు. వచ్చేనెల 6, 7 తేదీల్లో నల్గొండలో నిర్వహించే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. తదనంతరం ఆ మండలి నూతన డైరీ ఆవిష్కరణ చేశారు.
WGL: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు అన్యాయం జరిగిందని శనివారం నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. కొత్త ప్రాజెక్టులు లేకుండా పాత పనులకే పరిమితమైందని, యూజీడీ, మామునూరు వంటి కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదన్నారు. దీనిపై సీఎం స్పందించి జిల్లా అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని కోరారు.
BDK: ఇల్లందు మండలం మసివాగు గ్రామ పంచాయతీ పరిధిలో శనివారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కారు, ఆటో వేగంగా ఒకదానికొకటి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వారిని ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MDCL: అల్వాల్ ఇందిరా నగర్ కాలనీలోని ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం వద్ద శనివారం హిందూ సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాలు, పోస్టర్లు, బ్యానర్లు శనివారం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు నిమ్మ చిరంజీవి రెడ్డి సహా నిర్వాహకులు, సభ్యులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరూ సమ్మేళనానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు.
MHBD: గంగారం మండలం దుబ్బగూడంలో జనగాం పాపారావు తల్లి ఇటీవల మృతి చెందడంతో శనివారం మంత్రి సీతక్క ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్, గంగారం మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.