WNP: బుద్ధారం గండి వద్ద ఇవాళ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రేవల్లి మండలంలోని చిరుకపల్లికి చెందిన పోతుల కేశవులు, వనజ దంపతుల బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేశవులకు తల గాయంతో పాటు కాలు ఫ్రాక్చర్ అవ్వగా, భార్యకు కూడా గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108లో వారిని మహబూబ్ నగర్ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
WGL: పట్టణ కేంద్రంలోని ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌కి శుక్రవారం పత్తి భారీగా తరలివచ్చింది. అయితే ఈ వారం మొదటిరోజుతో పోలిస్తే ఈరోజు పత్తి ధర కాస్త పెరిగింది. ఈ వారం మొదటిరోజు క్వింటా పత్తి ధర రూ. 7545 ధర పలకగా.. మంగళవారం రూ. 7,510 అయింది. బుధవారం రూ. 7,515 ధర రాగా..గురువారం రూ. 7,550 అయింది. ఈరోజు మరింత పెరిగి రూ. 7,555 అయిందని అధికారులు తెలిపారు.
ASF: కౌటాల మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలకు మొత్తం 13 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు అధికారులు తెలిపారు. జనరల్ విభాగంలో 200 మందికి గాను 195 మంది హాజరు కాగా, ఐదుగురు రాలేదు. ఒకేషనల్ విభాగంలో 114 మందికి, 106 మంది పరీక్ష రాయగా, 8 మంది గైర్హాజరయ్యారని అధికారులు వెల్లడించారు.
KMR: మాచారెడ్డి జడ్పీహెచ్‌ఎస్‌లో శుక్రవారం సైబర్ క్రైమ్, చైల్డ్ ప్రొటెక్షన్ యాక్ట్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీసు కళా బృందం వారు విద్యార్థులకు ప్రదర్శనల ద్వారా సైబర్ మోసాలు, ఆన్‌లైన్ భద్రత, బాలల హక్కులు, చట్టాల గురించి వివరించారు. సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించారు.
SRPT: అనంతగిరి మండలంలోని మొగ్గులాయకోట గ్రామ శివారులో వెంకట సాయి, కేఎన్ఆర్ గ్రానైట్ పరిశ్రమల ఏర్పాటుపై తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజా అభిప్రాయ సేకరణ నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సీతారామరావు సమక్షంలో గ్రామస్థులు, సామాజిక కార్యకర్తలు తమ సానుకూల, వ్యతిరేక అభిప్రాయాలను వెల్లడించారు.
మెదక్ స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల కెరీర్ గైడెన్స్ సెల్, సింధుజ మైక్రో క్రెడిట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 28న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ హుస్సేన్ తెలిపారు. 18 రిలేషన్ ఆఫీసర్ ఉద్యోగాల కోసం కనీసం ఇంటర్ ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
KNR: గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామ పంచాయితీలో రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ రైతు గుర్తింపు కార్డు గురించి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కలిపించారు. వ్యవసాయ భూమి కలిగిన ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీని ఫిబ్రవరి 28 వరకు నమోదు చేసుకోవాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో AEO వెంకట్, సర్పంచ్ ముద్దం నగేష్, రైతులు పాల్గొన్నారు.
గద్వాల 2, 3 వార్డుల్లో వీధి కుక్కల బీభత్సంపై కాలనీవాసులు శుక్రవారం గద్వాల్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ జయలక్ష్మి వినతి పత్రం అందజేశారు. వీధుల్లో చిన్నారులు ఆడుకోవాలన్నా, మహిళలు బయటకు వెళ్లాలన్నా ప్రాణ భయంతో వణికిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్తి నష్టం వాటిల్లిన రైతులకు పరిహారం అందించి, కుక్కల బెడద నుంచి పట్టణాన్ని విముక్తి చేయాలని డిమాండ్ చేశారు.
VKB: దోమ మండలం శివారెడ్డిపల్లిలో శ్రీరేణుక ఎల్లమ్మ తల్లి వార్షికోత్సవాలు భక్తిశ్రద్ధతో ఘనంగా నిర్వహించబడ్డాయి. పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి దంపతులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు, కైంకర్యాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గ్రామ ప్రజలు ఐక్యంగా ఉండాలని, ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో సౌహార్దాన్ని పెంపొందిస్తాయని సూచించారు.
SRPT: నూతనకల్ మండలం నుంచి వెంకేపల్లి వరకు నిలిచిపోయిన తొమ్మిది కిలోమీటర్ల రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని తుంగతుర్తి ఎమ్మెల్యే సామేలు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కోరారు. హైదరాబాద్‌లోని అంబేద్కర్ భవనంలో మంత్రిని కలిసి శుక్రవారం వినతి పత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలియజేశారు.
KMR: జుక్కల్ మండలంలోని బస్వాపూర్ గ్రామంలో పారిశుధ్య పనులు చేపట్టారు. ఈ పారిశుధ్య పనులలో భాగంగా డ్రైనేజీని సిబ్బందితో శుభ్రం చేయించారు. అనంతరం పిచ్చి మొక్కలను తొలగించారు. సర్పంచ్ మాట్లాడుతూ.. వార్డులో విధి దీపాల, త్రాగునీరు, డ్రైనేజీ వంటి సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
PDPL: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో రంజాన్ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ హాజరై ముస్లిం మత పెద్దల సమస్యలను తెలుసుకున్నారు. గతంతో పోలిస్తే ఈసారి రంజాన్ వేడుకలను మరింత ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. నగర మేయర్ మహంకాళి స్వామి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆర్జీ-1 జీఎం, వన్ టౌన్ సీఐ ఉన్నారు.
MNCL: జన్నారం మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న దీక్షకు మద్దతుగా వారు శుక్రవారం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు. బీసీల సంక్షేమానికి ప్రభుత్వం రూ. 50 వేల కోట్లను కేటాయించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఉన్నారు.
జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందించేందుకు కథారచనలను ఆహ్వానిస్తున్నట్లు డీఈవో రాము శుక్రవారం తెలిపారు. కథల్లో నైతిక విలువలు, మానవతా భావాలు, నీతినిజాయితీ వంటి అంశాలు ప్రతిఫలించాలన్నారు. పాఠశాల స్థాయిలోనే కథారచన అలవాటు పెంపొందితే భవిష్యత్తులో మంచి రచయితలుగా ఎదుగుతారన్నారు.
HYD: వైసీపీ నేత, ఏపీ మండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. దీంతో ఆయనను నిన్న హైదరాబాద్‌కు తరలించారు. బంజారాహిల్స్ సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం బొత్స ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.