MBNR: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పొందాలంటే రైతులకు ఫార్మర్ ఐడీ తప్పనిసరి అని పోల్కంపల్లి ఏఈవో శివ తెలిపారు. రైతులు ఆధార్ నంబర్ ద్వారా అధికారిక వెబ్‌సైట్‌లో తమ ఫార్మర్ రిజిస్ట్రీ స్థితిని పరిశీలించుకోవచ్చన్నారు. లింక్‌లో ‘Approved’ లేదా ‘Pending’గా చూపితే నమోదు పూర్తైనట్లేనని స్పష్టం చేశారు. ప్రయోజనాల కోసం వెంటనే నమోదు చేసుకోవాలని సూచించారు.
KMR: లింగంపేట మండలం ముస్తాపూర్ పరిధిలో కరీంనగర్-కామారెడ్డి-ఎల్లారెడ్డి రహదారిలో నోటీసులు అందజేసినప్పటికీ శివాజీ విగ్రహం ఏర్పాటు చేపట్టడంతో లింగంపేట ఎమ్మార్వో కార్యాలయానికి రోడ్లు, భవనాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. హైందవ సమాజాన్ని మేల్కొలిపిన శివాజీ విగ్రహ ఆవిష్కరణను ఆపివేయించడం తగదని పలు సంఘాలు మండిపడుతున్నాయి.
HNK: చదువు మన తలరాతను మారుస్తుందని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ మర్కజి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా బాలవికాస సహకారంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సరైన మార్గంలో ప్రయాణించి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే అన్నారు.
SRPT: పోలీసు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం సూర్యాపేట జిల్లా ఎస్పీ కార్యాలయంలో, ఫిర్యాదు దారులతో ఎస్పీ నరసింహ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పలు గ్రామాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా తక్షణ ఆదేశాలు జారీ చేశారు.
SRCL: బాధితుల సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహిస్తున్నామని సిరిసిల్ల ఎస్పీ మహేష్ బి గీతే అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి 27 ఫిర్యాదులను స్వీకరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు.
NZB: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 107 ఫిర్యాదులు అందాయి. నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్‌లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు.
KNR: చొప్పదండి పట్టణంలోని రెండవ వార్డులో గౌరవ ఎమ్మెల్యే డా. మేడిపల్లి సత్యమన్న, కౌన్సిలర్ కొట్టె అశోక్ చొరవతో రూ. 18 లక్షల నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. తుమ్మ రాములు ఇంటి నుంచి వెంకట్ రెడ్డి ఇంటివరకు అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, చెట్పెల్లి రాజ్ కొమురెళ్లి ఇంటి నుంచి వెంకట్ రెడ్డి ఇంటివరకు సీసీ రోడ్డు పనులు మొదలయ్యాయి.
HYD: హెల్మెట్ లేకుండా పట్టుబడితే FINEతో పాటు పోలీసులు FREEగా హెల్మెట్ ఇస్తున్నారు. మల్కాజిగిరి ట్రాఫిక్ విభాగం ‘హెల్మెట్ బ్యాంక్’ పేరుతో పోలీసులు సంగీత్ చౌరస్తాలో ఈ వినూత్న కార్యక్రమం చేపట్టారు. బైకర్ వివరాలు నమోదు చేసి హెల్మెట్ తీసుకోవచ్చు. 24 గంటల్లోపు సొంతంగా హెల్మెట్ కొనుక్కుని పోలీసుల వద్ద తీసుకున్నది తిరిగి ఇచ్చేయాలి.
BHNG: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆరో రోజుకు చేరుకున్నాయి. నేడు స్వామివారు గోవర్ధన గిరిధారి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేద మంత్రాల సాక్షిగా, మంగళ వాయిద్యాలు, కోలాటాల నడుమ పురవీధుల్లో స్వామివారి ఊరేగింపు వైభవంగా సాగింది. ఆలయ అర్చకులు, అధికారులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు.
ASF: చింతలమానేపల్లి మండలంలో 23 గ్రామాల ప్రజలు లో-ఓల్టేజ్ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని MLA హరీష్ బాబు చొరవ తీసుకుని 33/11KV సబ్ స్టేషన్‌ను ఇటీవల మంజూరు చేయించారు. ఈ మేరకు సోమవారం 33/11KV సబ్ స్టేషన్‌కు MLA భూమి పూజ నిర్వహించారు. సబ్ స్టేషన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు.
నిర్మల్ నూతన మున్సిపల్ ఛైర్మన్‌గా ఎన్నికైన అప్పల కావ్య గణేష్ చక్రవర్తిలను ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు సోమవారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలిపారు. కళాశాల అభివృద్ధి కొరకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఈ సందర్భంగా వారు హామీ ఇచ్చారు.
ADB: ఉట్నూరు ప్రభుత్వ గిరిజన మహిళా గురుకుల డిగ్రీ కళాశాల ప్రవేశాల కరపత్రాలను ఐటీడీఏ పీవో యువరాజ్ మర్మట్ సోమవారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. గురుకులాల్లో ఉచిత వసతితో కూడిన నాణ్యమైన విద్య అందుతుందని తెలిపారు. ఇంటర్ పూర్తి చేసిన గిరిజన బాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీవాణి, అధ్యాపకులు పాల్గొన్నారు.
వనపర్తి జిల్లా వ్యాప్తంగా 7228 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో హాజరుకానున్నారని వనపర్తి డీఈవో అబ్దుల్ ఘనీ తెలిపారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 37 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం 37 మంది సూపర్డెంట్లు, 37 మంది డిపార్ట్మెంటల్ అధికారులను నియమించినట్లు తెలిపారు.
KMR: జిల్లా కేంద్రంలో 5 రోజుల నుంచి నెలకొన్న రాజకీయ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో మహబూబ్ నగర్ MP డీకే అరుణ కామారెడ్డికి చేరుకున్నారు. MLA క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించిన తీరుపై, ఉద్రిక్త పరిస్థితుల గల కారణాలను MLA రమణారెడ్డిని అడిగి తెలుసుకోనున్నారు. ఆయనతో భేటీ అనంతరం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ములుగు జిల్లా కేంద్రంలో జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకేన్‌ను మున్సిపల్ ఛైర్‌పర్సన్ చింతనిప్పుల చంద్రకళ బిక్షపతి, వైస్ ఛైర్‌పర్సన్ ఆసియా షాహిన్ రియాజ్ మిర్జా, కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా ఎస్పీకి నూతన మున్సిపల్ పాలకవర్గం సభ్యులు పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతలో సత్కరించారు. అనంతరం నూతన పాలక వర్గానికి ఎస్పీ శుభాకాంక్షలు తెలిపారు.