SRPT: నడిగూడెం మండలం కర్విరాల గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న గంగమ్మ తల్లి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య భూమి పూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. భక్తి మార్గం ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు.
NRML: నిర్మల్ సోమవారపేట ప్రభుత్వ బాలికల పాఠశాలకు చెందిన ఎస్. వైష్ణవి, ఎం.చరణ్య ఎన్‌ఎంఎంఎస్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైనట్లు ప్రధాన ఉపాధ్యాయులు పరమేశ్వర్ శనివారం ప్రకటనలో తెలిపారు. విద్యార్థులకు సంవత్సరానికి రూ. 12,000 చొప్పున నాలుగేళ్లు ఉపకార వేతనం అందుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను వారు అభినందించారు.
NZB: నవీపేట్ మండల పరిధిలోని ఫకీరాబాద్ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు టిప్పర్లను పోలీసులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్రలోని గంజిగావ్ నుంచి నిజామాబాద్‌కు ఇసుక తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో ఎస్సై శ్రీకాంత్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి వాహనాలను పట్టుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు.
VKB: పట్టణాన్ని క్లీన్ & గ్రీన్ సిటీగా మార్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం మున్సిపల్లో శానిటేషన్ పనులను కమిషనర్ విక్రమ్ సింహరెడ్డి శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ ఏసుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఎక్కడా చెత్తాచెదారం ఉంచకుండా పరిశుభ్ర వాతావరణం కల్పించాలన్నారు.
KMM: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కరుణగిరిలో రేపటి నుంచి పాలేరు నియోజకవర్గ స్థాయి క్రికెట్ పోటీలు ప్రారంభం కానున్నాయి. కరుణగిరి యూత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ టోర్నీ వాల్‌పోస్టర్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఇవాళ ఆవిష్కరించారు.
SDPT: హుస్నాబాద్ పట్టణ ప్రజలకు, దుకాణ యజమానులు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పన్నులు సకాలంలో చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ కోరారు. ఇంటి పన్నులు, నల్లా పన్నులు, ట్రేడ్ లైసెన్సులు మార్చి 31వ తేదీలోపు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలన్నారు. పన్నులు వసూలు చేయడానికి వచ్చే సిబ్బందికి సహకరించాలని తెలిపారు.
BDK: భద్రాచలం పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కంబపాటి శ్రీనివాస్ తనయుడు కంబపాటి జశ్వంత్ ఈరోజు మృతి చెందారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబానికి ధైర్యం చెబుతూ, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.
KMR: రేషన్ దుకాణాల ద్వారా రేపట్టి నుంచి బియ్యం పంపిణీ చేయనున్నట్లు భిక్నూ సునీత ఒక ప్రకటనలో తెలిపారు. డీలర్లు నిర్ణీత సమయానికి దుకాణాలను తెరిచి ఉంచాలని, లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంపిణీ వివరాలను లబ్ధిదారులకు ముందుగానే తెలియజేయాలని కోరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్‌ను పీఎంశ్రీ నోడల్ అధికారి ప్రవీర్ కుమార్ జిల్లా సమీకృత సముదాయంలో మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా విద్యాలయాల్లో పీఎంశ్రీ కింద అమలు అవుతున్న కార్యక్రమాలను పరిశీలించేందుకు కేంద్ర ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్, అర్బన్ ఎఫైర్స్ జాయింట్ సెక్రటరీ ప్రవీర్ కుమార్ జిల్లాకు వచ్చారు.
MNCL: బెల్లంపల్లి పట్టణంలో విలియన్స్ హో సంస్కారణార్ధం టైలర్స్ & వర్కర్స్ అసోసియేషన్, మేరు సంఘం ఆధ్వర్యంలో శనివారం టైలర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. అసోసియేషన్ అధ్యక్షులు కీర్తి రాము మాట్లాడుతూ.. టైలర్స్ డే కుట్టు కళకు గౌరవం తెలిపే రోజు అన్నారు. దర్జీల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూడకుండా ప్రత్యేక శ్రద్ద వహించి, సంక్షేమ పథకాలు అందేలా చూడాలని కోరారు.
BHPL: చిట్యాల మండలం గిద్దెముత్తారం అందుకుతండా గ్రామాల్లో మొబైల్ నెట్‌వర్క్ పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసర సమయాల్లో ఫోన్ మాట్లాడాలంటే ఇళ్ల పైకప్పుల పైకి ఎక్కాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, టెలికాం సంస్థలు తక్షణమే టవర్లు ఏర్పాటు చేసి నెట్‌వర్క్ సమస్యను పరిష్కరించాలన్నారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో శనివారం పీఎం శ్రీ జిల్లాస్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డీఈఓ భోజన్న ప్రారంబించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటూ క్రీడల్లో రాణించాలని అన్నారు. జిల్లాలోని ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
VKB: మోమిన్‌పేట్ మండలంలో నివాసం ఉండే రహుఫ్ అనే వ్యక్తిపై తన బంధువులు వారసత్వపు భూతగాదాలు నడుస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం 3 గంటలకు తనపై దాడి చేశారని ఆరోపించారు. ఈ దాడిలో రహుఫ్‌కు బలమైన గాయం తగలడంతో సంగారెడ్డి గవర్నమెంట్ హాస్పిటిల్ తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి HYD తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
BDK: భద్రాచలం రామాలయంలో తయారవుతున్న జైశ్రీరామ్ పేరు గల ఇటుకలను ఆదివారం నుంచి విక్రయించనున్నారు. ఇంటి నిర్మాణంలో తొలి ఇటుకగా వాడితే శుభం కలుగుతుంది. ఒక్కో ఇటుక ధర రూ. 60 ఉంటుందని అంచనా. ఇసుక, మట్టి, సిమెంట్ మిశ్రమంతో ఇవి తయారవుతున్నాయి. ఒక్కోటి సుమారు 2 కిలోల బరువు ఉంటుంది. ఈ ఇటుకలను చిత్రకూట మండపం సమీపంలో భక్తులకు అందుబాటులో ఉంచనున్నారు.
JGL: రాయికల్ మండలం మహితాపూర్ గ్రామంలో కుట్టు మెషీన్ ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరితో రూ. వెయ్యి వసూలు చేసిన ఘటన కలకలం రేపుతోంది. ‘ఐ క్యు మైండ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ పేరుతో రశీదులు ఇస్తూ 100 రోజుల్లో మెషీన్ అందజేస్తామని, లేకపోతే డబ్బులు తిరిగి చెల్లిస్తామని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.