KRNL: వైసీపీ అసెంబ్లీ పరిశీలకులుగా మంత్రాలయం నియోజకవర్గం నుంచి ఇద్దరికి అవకాశం లభించింది. పత్తికొండ అసెంబ్లీ పరిశీలకులుగా సీతారామిరెడ్డి, కోడుమూరు అసెంబ్లీ పరిశీలకులుగా పెద్దకడబూరు మండలం కంబదహాల్‌కు చెందిన పురుషోత్తం రెడ్డి నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను వైసీపీ కేంద్ర పార్టీ కార్యాలయం విడుదల చేసింది.
PLD: అమరావతిలోని శ్రీ బాల చాముండికా సమేత శ్రీ అమరేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం హుండీ కానుకల లెక్కింపు నిర్వహించారు. గత 3 నెలల 9 రోజులకు గాను మొత్తం రూ. 41,42,621 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో తెలిపారు. భక్తుల రద్దీ పెరగడంతో కేవలం ప్రధాన హుండీల ద్వారానే రూ. 40.42 లక్షల ఆదాయం లభించిందని అధికారులు వెల్లడించారు.
SDPT: జాతీయ చేనేత అవార్డ్స్-2026 కొరకు చేనేత కళాకారులు, డిజైనర్ వృత్తిలో నైపుణ్యం కలిగిన కళాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఎం.సాగర్ పేర్కొన్నారు. అర్హులైన చేనేత నిపుణులు ఈనెల 23 వరకు సిద్ధిపేట చేనేత జౌళి శాఖ కార్యాలయంలో దరఖాస్తుతో పాటు వారు తయారు చేసిన వస్త్రములు సమర్పించాలని కోరారు.
MHBD: తొర్రూరు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చర్లపాలెం గ్రామానికి చెందిన చిట్టిమల్ల లచ్చమ్మపై ఆమె కుమారుడు యాకయ్య మద్యం మత్తులో బుధవారం రాత్రిగొడ్డలితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన లచ్చమ్మను స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా ఎంజీఎం హాస్పిటల్ కుతరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన అనంతరం నిందితుడు పరారైనట్లు తెలిసింది.
TG: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని ఒకే పరీక్ష కేంద్రంలో 10 మంది ఇంటర్ విద్యార్థులు డిబార్ అయ్యారు. బోర్డు పరిశీలకుడు రాఘవ నిర్వహించిన తనిఖీల్లో గణితం, పౌరశాస్త్రం, బయోకెమిస్ట్రీ పరీక్షల్లో విద్యార్థులు కాపీ కొడుతూ దొరికారు. జిల్లా వ్యాప్తంగా నిన్న వీరు 10 మంది, వరంగల్‌లో ముగ్గురు కలిపి మొత్తం 13 మందిపై అధికారులు డిబార్ వేటు వేశారు.
కర్నూలు డివిజన్లో 22ఏ, చుక్కల భూములు, వెబ్ ల్యాండ్ సవరణలకు సంబంధించి 351 దరఖాస్తులను ఆమోదించినట్లు బుధవారం జేసీ నూరుల్ ఖమర్ తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమావేశంలో 456 ప్రతిపాదనలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నారు. భూ సమస్యల పరిష్కారంలో వేగం పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో వెంకట నారాయణమ్మ, ఆర్డీవో సందీప్ కుమార్ పాల్గొన్నారు.
NTR: విజయవాడ చిట్టినగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన “వి కన్వెన్షన్” ను మంత్రి కొల్లు రవీంద్ర బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన హంగులతో, ఆధునిక సదుపాయాలతో ఏర్పాటు చేసిన ఈ కన్వెన్షన్ సెంటర్ స్థానిక ప్రజలకు శుభకార్యాల నిర్వహణకు అనుకూల వేదికగా నిలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
ELR: జిల్లా మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నట్లు AP NGOs అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ బుధవారం తెలిపారు. మార్చి 5న ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం వెనుక AP NGOs ఆధ్వర్యంలో పోటీలు జరుగుతాయన్నారు. చెస్, కారమ్స్, స్పీడ్ వాక్, మ్యూజికల్ చైర్స్, టెన్నీస్ కాయిట్, పరుగు పందెం పోటీలు ఉంటాయన్నారు. మహిళా ఉద్యోగులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
KMM: రఘునాథపాలెం మండలంలోని పాపటపల్లిలో గ్రామంలో పేకాడుతున్నారన్న సమాచారంతో గురువారం తెల్లవారుజామున పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.3 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ ఉస్మాన్ షరీఫ్ తెలిపారు. మండలంలో పేకాట, గంజాయి, డ్రగ్స్ వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు.
JGL: జిల్లాలో మార్క్ ఫెడ్ మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు పలువురు రైతులు వినతిపత్రం సమర్పించారు. ఖరీఫ్లో మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన మక్కలకి జగిత్యాలకి చెందిన 300పైగా రైతుల 6000క్వింటాల్ల మక్కల డబ్బులు బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. రబీకి చెందిన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తానన్నారు.
VZM: కోరుకొండ రైల్వే స్టేషన్ జొన్నవలస రైల్వేగేట్ పట్టాల మధ్య గుర్తు తెలియని మృతదేహం గుర్తించినట్లు హెచ్.సీ.ఎం.ఎస్.ప్రసాద్ బుధవారం తెలిపారు. సుమారు 5 అడుగుల 2 అంగుళాల పొడవు ఉండి, చామనచాయ రంగులో ఉన్నట్లు చెప్పారు. నీలం రంగు రౌండ్ నెక్ టీ షర్ట్, నిక్కర్, మృతదేహం పక్కన తెలుపు, ఎరుపు టవలు ఉన్నట్లు పేర్కొన్నారు. వివరాలకు 9440170317ను సంప్రదించండి.
ADB: బోరజ్ మండలంలోని జాతీయ రహదారిపై ఆటో అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని పూసాయి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ప్యాసింజర్‌లతో పాటు ఇతర సామాగ్రితో అధిక లోడుతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
BDK: జిల్లాలో మార్చి 6 నుంచి 16 వరకు ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ అంకిత్ తెలిపారు. బుధవారం అధికారులతో సమీక్షలో మాట్లాడారు. గ్రామం, మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య పనులను విస్తృతంగా చేపట్టాలని ఆదేశించారు. పాఠశాలలు, అంగన్వాడీలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పిచ్చి మొక్కలను తొలగించి, తడి-పొడి చెత్తను వేరుగా సేకరించాలని అన్నారు.
వనపర్తి జిల్లా కేంద్రంలో ఓ పాఠశాల ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనం (TS 32 0570) బుధవారం చోరీకి గురైంది. పెద్దమందడి మండలం మనిగిళ్లకు చెందిన అశోక్ పాఠశాల వేడుకల కోసం వచ్చి బైక్ నిలపగా, తిరిగి వచ్చేసరికి అది కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు వనపర్తి టౌన్ ఎస్సై హరిప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
W.G: నరసాపురంలోని ఏపీఈపీడీసీఎల్ కార్యాలయంలో ఈ నెల 6 (శుక్రవారం) భారీ రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు ఈఈ కె.మధుకుమార్ తెలిపారు. విద్యుత్ శాఖ ఉద్యోగులు స్వచ్ఛందంగా పాల్గొనే ఈ కార్యక్రమం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుందన్నారు. అత్యవసర సమయాల్లో ప్రాణదాతలుగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ రక్తదానానికి ముందుకు రావాలని ఆయన కోరారు.