BDK: మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ పరీక్ష కేంద్రాలను డీఎస్పి రవీందర్ రెడ్డి, సిఐ నాగబాబు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పి పరీక్షలు రాసే విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలని కళాశాల యాజమాన్యానికి ఆదేశించారు. ఒత్తిడికి లోనవ్వకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని అన్నారు.
SRD: రాష్ట్రంలోని స్పోర్ట్స్ స్కూల్ లో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 4వ తరగతి ప్రవేశాల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాశాఖ అభివృద్ధి అధికారి అఖిలేష్ రెడ్డి గురువారం తెలిపారు. ఈ నెల 26వ తేదీ నుంచి www.tgss.telangana.gov.in సైట్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు ఆయన వెల్లడించారు.
NLR: బుచ్చి పట్టణం బేల్దార్ పాళెం లోని పోలేరమ్మ తల్లి ఆలయం పునఃనిర్మాణం జరిగింది. మూడు రోజులు గా మహాకుభాభిషేక కార్యక్రమాలు వైభవంగా జరిపారు. ఇందులో భాగంగా చివరి రోజు 108 కళాశాలతో అమ్మవారికి అభిషేకాలు చేశారు. ఆలయ ప్రాంగణంలో పోతురాజుస్వామి విగ్రహం ప్రతిష్టించారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
HYD: చర్లపల్లి ఖైదీల వ్యవసాయ కాలనీ(పీఏసీ)లోని ఆయుర్వేద గ్రామంలో కోల్డ్ ప్రెస్ ఆయిల్ యూనిట్‌ను జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా ప్రారంభించారు. 6 సంవత్సరాల విరామం అనంతరం ఆయుర్వేద గ్రామాన్ని పునః ప్రారంభించారు. ఖైదీల సంక్షేమం, పునరావాసానికి ఈ శిక్షణ కేంద్రం దోహదపడుతుందని ఆమె స్పష్టంచేశారు.
SS: ధర్మవరం పట్టణంలోని వైఎస్సార్ కాలనీలో శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం గురువారం వైభవంగా జరిగింది. దేవాలయ భక్త సేవా మండలి, అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి దంపతులు ఈ వేడుకలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.
PLD: నరసరావుపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరిగా తిరుగుతున్న ఒక బాలుడిని స్థానికులు గమనించి గురువారం పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం ఆ బాలుడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో భద్రంగా ఉన్నాడని సీఐ ఫిరోజ్ తెలిపారు. బాలుడు వివరాలు చెప్పలేకపోతున్నాడని, ఈ బాలుడి వివరాలు తెలిసిన వారు వెంటనే పోలీసులను సంప్రదించాలని ఆయన కోరారు.
KRNL: సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రంలో సుపరిపాలన సాధ్యమని టీడీపీ సీనియర్ నాయకులు వీరేష్ గౌడ్ స్పష్టం చేశారు. గురువారం పెద్దకడబూరు మండలం చిన్నతుంబళంలో ఉపాధి హామీ పథకం కింద సీసీ రోడ్డు నిర్మాణానికి టీడీపీ సీనియర్ నాయకులు వీరేష్ గౌడ్ భూమిపూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం గ్రామాలాభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.
AP: రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. సీమ ప్రాంతానికి ఈ ప్రాజెక్ట్ అత్యంత ప్రాధాన్యమైనదని, దీనిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వాస్తవమా.. కాదా? అని ఆయన నిలదీశారు. ప్రాజెక్ట్ పనులు నిలిపివేతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అసులు ఈ పథకాన్ని ఎప్పుడు ప్రారంభించి.. ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు.
MHBD: నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో రజక కుటుంబంపై జరిగిన దాడిని ఖండిస్తూ… తొర్రూరు బీసీ సంఘాల ఆధ్వర్యంలో స్థానిక విశ్రాంతి భవనం నుంచి బస్టాండ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, రజక కుటుంబంపై దాడికి పాల్పడి, చిన్నారి మృతికి కారకులైన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
WNP: నూతనంగా ఎన్నికైన పెబ్బేరు మున్సిపల్ పాలకవర్గం జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభిని కలిసి, పెబ్బేరు అభివృద్ధికి సహకరించమని విజ్ఞప్తి చేశారు. గత కొంతకాలంగా నిలిచిపోయిన రోడ్ విస్తరణ, తాగునీటి సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పారిశుద్ధ్యం, వీధి దీపాలు తాగునీటిపై ప్రత్యేక దృష్టి ఉంచాలని కలెక్టర్ పాలకవర్గానికి దిశానిర్దేశం చేశారు.
NDL: కొత్తపల్లి మండలం ఎర్ర మఠంకు చెందిన నాయకులు, మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అనుచరుడు వెంకట్ రెడ్డి క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతూ మృతి చెందారు. విషయం తెలిసిన బైరెడ్డి వెంకట్ రెడ్డి పార్థివ దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
SRCL: పేదల ఆత్మీయ గౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ ఇల్లు అని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు కొత్త దుస్తులను అందజేశారు. మండల కాంగ్రెస్ నాయకులు నాగం కుమార్, చింతపంటీ రామస్వామి, శేఖర్, తదితరులు ఉన్నారు.
W.G: నరసాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రెవెన్యూ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న వైద్య పరీక్షల శిబిరాన్ని నరసాపురం ఆర్డీవో దాసిరాజు గురువారం సందర్శించి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సిబ్బంది ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని సూచించారు.
KDP: అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్ల డిమాండ్లు సమంజసమని, వాటిని ఆలస్యం చేయకుండా పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత అని కాంగ్రెస్ నేత తులసి రెడ్డి అన్నారు. గురువారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ.. వర్కర్లకు రూ.11,500, హెల్పర్లకు రూ.7,000 మాత్రమే వేతనం ఇవ్వడం అన్యాయమన్నారు. కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, ఖాళీగా ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలన్నారు.
E.G: రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు అంగన్వాడి వర్కర్లు & హెల్పర్లు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం కొనసాగాయి. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు ద్రోహం చేసే 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే అంగన్వాడీ వర్కర్లకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, గ్రాడ్యూటీ అమలు చేయాలని, వేతనాలతో కూడిన మెడికల్ లీవ్ లు ఇవ్వాలన్నారు.