PDPL: గోదావరిఖని సింగరేణి స్టేడియం సమీపంలో సంస్థ ఏర్పాటు చేసిన RO వాటర్ ప్లాంట్ నిర్వహణ సరిగా లేకపోవడంతో పరిసర ప్రాంతాలకు చెందిన కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభంలోనే మంచినీటి కోసం అవస్థలు పడుతున్నారు. ఈ పంపు ఎప్పుడు వస్తుందో తెలియదు. క్యాన్లు, బిందెలు పట్టుకొని రావడం, తిరిగి వెళ్లడం జరుగుతుంది. బాగు చేయాలని కోరుతున్నారు.
SRD: పటాన్ చెరులో భర్త భార్య, కొడుకుపై కత్తితో దాడి చేశాడు. మామిడిపల్లికి చెందిన ఆనందరావు ముత్తంగి శ్రీనివాసరెడ్డి కాలనీలో నివసిస్తున్నాడు. భార్యపై అనుమానంతో తరచూ గొడవపడేవాడు. ఫిబ్రవరి 24న మద్యం మత్తులో వచ్చి భార్య కవిత, అడ్డుకున్న కుమారుడు ధీరజ్‌పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
HYD శివారు నారపల్లిలో CPRI ప్రాంతీయ కేంద్రం కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ కేంద్రం ద్వారా విద్యుత్ పరికరాల పరీక్షలు, క్వాలిటీ సర్టిఫికేషన్, షార్ట్ సర్క్యూట్ పరీక్షలు, మీటర్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, కేబుల్స్ వంటి సామగ్రి నాణ్యత నిర్ధారణ జరుగుతాయి. విద్యుత్ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్‌లోకి విడుదల చేసే ముందు CPRI టెస్ట్ చేస్తుంది.
TPT: తిరుపతి కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అధికారులు అర్జీలు స్వీకరించి, ప్రజల సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటారని పేర్కొన్నారు. జిల్లా వాసులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.
ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో నటించిన అంతర్జాతీయ చిత్రం ‘ది బ్లఫ్’పై సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించాడు. ఈ సినిమాను చూసిన ఆయన, SM వేదికగా తన రివ్యూను పంచుకున్నాడు. ఈ చిత్రంలో ప్రియాంక నటన అద్భుతంగా ఉందని, పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టిందని మహేశ్ కొనియాడాడు. గ్లోబల్ స్టార్ స్థాయికి తగ్గట్లుగా ప్రియాంక సత్తా చాటిందని పేర్కొన్నాడు.
MDCL: రోడ్డు పై వాహనదారుల డ్రైవింగ్, ట్రాఫిక్ నియమ నిబంధనలపై తేడా వచ్చిందా..? వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. కూకట్ పల్లి, KPHB, బాలానగర్ ప్రాంతాల్లో నెంబర్ ప్లేట్ కనిపించకుండా డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం లాంటి వారిపై చర్యలు తీసుకుంటూ హెచ్చరించారు. ఎవరైనా హెల్మెట్ ధరించకపోయినా 9490617346 వాట్సప్ చేయండి.
ADB: నార్నూర్ మండలంలోని కొత్తపల్లి(H) దీక్షభూమి వద్ద లంబాడీ భక్తులు గత నెల 15వ తేదీన 41 రోజుల సేవాలాల్ దీక్షకు స్వీకరించారు. దీన్ని పురస్కరించుకొని ఈ నెల 19న దీక్షగురు ప్రేమ్ సింగ్ మహారాజ్ ఆధ్వర్యంలో కొత్తపల్లి నుంచి MHలోని కాశి పౌరాగఢ్ వరకు సుమారు 360 కి.మీ పాదయాత్రగా వెళ్లనున్నట్లు ఆలయ కమిటీ సభ్యుడు దేవేందర్ రాథోడ్ తెలిపారు.
KRNL: చరిత్రలో తొలిసారిగా అంగన్వాడీలకు రెండుసార్లు వేతనాలు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఆదివారం పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అంగన్వాడీ కేంద్రాలకు మౌలిక సదుపాయాలు కల్పించి, ప్రతి కేంద్రానికి నిధులు కేటాయించిందన్నారు. కార్యకర్తలకు స్మార్ట్ ఫోన్లు అందజేశామని తెలిపారు.
బద్వేల్ లక్ష్మిపాలెంలో మూడవ రోజు నిర్వహిస్తున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఆదివారం ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సింహ వాహనంపై అలంకారప్రదంగా దర్శనం ఇచ్చి భక్తులను అనుగ్రహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన భరతనాట్యం ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
NRPT: మక్తల్ మండలం జౌలాపురం గ్రామంలో జక్లేర్‌కు వెళ్లే ప్రధాన రహదారి దెబ్బతినడంతో మరమ్మతు పనులకు శ్రీకారం చుట్టారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు లక్ష్మీకాంత్ రెడ్డి భూమిపూజ చేసి పనులను ప్రారంభించారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పనులు చేపట్టామని, గ్రామాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని నాయకులు తెలిపారు.
NDL: డోన్ పట్టణంలో అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్న హుస్సేన్పిర కుటుంబానికి చేయూత స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో రూ. 25 వేల ఆర్థిక సహాయం అందించారు. డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. రాజేంద్రప్రసాద్ రెడ్డి, యశోద హాస్పిటల్ అధినేత డా. సుంకన్న, చంద్రశేఖర్ ఈ సహాయాన్ని ఆదివారం అందజేశారు. ఆపదలో ఉన్నవారికి చేయూతనివ్వాలని దాతలు పిలుపునిచ్చారు.
KRNL: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని శ్రీశైలం, మహానంది, యాగంటి, కొత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తదితర ఆలయాలను చంద్రగ్రహణం కారణంగా రేపు వేకువజాము నుంచి మూసివేస్తున్నట్లు ఈవోలు తెలిపారు. శ్రీశైలంలో రేపు రాత్రి 9కి భక్తులకు దర్శనం కల్పిస్తారు. మిగతా ఆలయాల్లో బుధవారం వేకువజామున సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు చేపడతారు.
TG: అహ్మదాబాద్‌లోని సబర్మతి నది ప్రక్షాళన కోసం 22KM పరిధిలో 10 వేల మందిని తరలించినట్లు అక్కడి అధికారులే తెలిపారని మంత్రి శ్రీహరి, ఎంపీ చామల కిరణ్ వెల్లడించారు. సబర్మతికి నర్మదా నీటిని ఇచ్చినట్లే, మూసీకి గోదావరి నీటిని తేవాలని సీఎం రేవంత్ ప్రయత్నిస్తుంటే BJP, BRS అడ్డుపడుతున్నాయని విమర్శించారు. నగర అభివృద్ధి కోసం మూసీ ప్రక్షాళన జరిగి తీరాలని వారు స్పష్టం చేశారు.
ATP: గుత్తి మండలం కొత్తపేట గ్రామంలోని చెరువు కట్టపై వెలసిన హజరత్ యాదుల్లాహ్ భాష ఖాదిరి రహమతుల్లా అలైహి 175వ ఉరుసు ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వామివారి గ్రంధాన్ని గ్రామంలో ఊరేగింపు నిర్వహించి స్వామికి సమర్పించారు.
AP: డోలోత్సవాన్ని పురస్కరించుకుని సింహగిరిపై నుంచి స్వామి, అమ్మవార్లు కొండ దిగువకు తరలిరానున్నారు. ఈ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో వెంకటరావు తెలిపారు. ఉత్సవం పూర్తయ్యే వరకు అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. అలాగే, మార్చి నెలాఖరు నాటికి అన్ని నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.