RR: ఆడుకుంటూ వెళ్లి బాలిక నీటి సంపులో పడి మృతి చెందిన ఘటన మంచాల మండల పరిధిలో చోటుచేసుకుంది. మండల పరిధిలోని తాళ్లపల్లిగూడలో ఆడుకునేందుకు వెళ్లిన బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గాలించారు. దీంతో ఇంటి పక్కనే ఉన్న నీటి సంపులో బాలిక మృతదేహం లభ్యం కావడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కృష్ణా: అవనిగడ్డలో నూతనంగా నిర్మించిన రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ లైబ్రరీ కం రీడింగ్ హాలును ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రారంభించారు. 2016-17 ఎంపీ లాడ్స్ నిధుల ద్వారా అప్పటి ఎంపీ కొనకళ్ళ నారాయణరావు మంజూరు చేసిన రూ.5 లక్షలు, సంఘ శాశ్వత అధ్యక్షులు కాశీభట్ల నాగేశ్వరరావు విరాళం రూ.4 లక్షలు, సభ్యుల విరాళాలతో ఈ భవనం నిర్మించారు.
CTR: ఎస్పీ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆదివారం కార్డెన్ సర్చ్ నిర్వహించారు. నేరాలు అక్రమ రవాణా అరికట్టేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు. ఈ తనిఖీల్లో 10 ద్విచక్ర వాహనాలు, 10 లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు అనుమానాస్పద వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.
ELR: గణపవరం శ్రీ చింతలపాటి బాపిరాజు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఈనెల 23వ తేదీన నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం అవుతాయని పరీక్షల చీఫ్ సూపరింటెండెంట్ కె నాగేశ్వరరావు శర్మ ఆదివారం తెలిపారు. పరీక్ష కేంద్రంలో ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు. మొదటి సంవత్సరం జనరల్ విద్యార్ధులు 377 మంది, వొకేషనల్ విద్యార్ధులు 34 మంది పరీక్షలకు హాజరవుతారన్నారు.
SRPT: చిలుకూరు మండల కేంద్రానికి చెందిన బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు ఓబులు మరణం పట్ల మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆదివారం ఓబులు భౌతికకాయానికి ఆయన నివాళులర్పించి, పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం శోకసప్త కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. పార్టీ ఒక నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయిందని పేర్కొన్నారు.
ASF: సింగిల్ యూజ్‌డ్ ప్లాస్టిక్ వినియోగం పూర్తిగా నిషేధమని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పవని కాగజ్ నగర్ మున్సిపల్ కమిషనర్ బీ.తిరుపతి ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ప్లాస్టిక్ కవర్లు, ఇతర నిషేధిత వస్తువులను విక్రయిస్తున్న వ్యాపారులను గుర్తించి సామగ్రి స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రజలు ప్లాస్టిక్‌కు బదులు పర్యావరణ హితమైన వస్తువులను వినియోగించాలన్నారు.
KMR: సవాళ్లు, ప్రతి సవాళ్లతో కామారెడ్డి రణరంగంగా మారింది. అభివృద్ధి విషయంలో పోరాడాల్సిన వారే ఆరోపణలు, ప్రత్యారోపణలతో రాజకీయ యుద్ధం ప్రారంభమైంది. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి ఇరు పార్టీల అధినేతలు వెళ్లి సంబంధిత అంశాలపై చర్చించి నిజానిజాలు తేల్చుకుంటారా! ఈ అంశాలపై ముగింపు కార్డు వేస్తారా! అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
KMM: సత్తుపల్లి మున్సిపల్ ఛైర్మన్ రహానా బేగం కమల్ పాషా, వైస్ ఛైర్మన్ సుమలత వేణు, అలాగే సత్తుపల్లి మున్సిపల్ కౌన్సిలర్లను ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే రాగమయి సత్కరించారు. ప్రభుత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని మరింత రెట్టింపు చేసేలా పాలకవర్గం కృషి చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే వారికి తేనెటీ విందు ఏర్పాటు చేశారు.
BDK: ఫిబ్రవరి 27న హైదరాబాద్‌లో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగే కమ్యూనిస్ట్ మహాసభను జయప్రదం చేయాలని మాజీ సర్పంచ్ శ్రీను తెలిపారు. ఇల్లందు మండలం పోచారం గ్రామంలో పోస్టర్‌ను ఆదివారం ఆవిష్కరించారు. భారతదేశం ఒక అర్ధ వలస, అర్ధ బుస్వామ్య వ్యవస్థ అని, దీనిని కూల్చివేసి నూతన వ్యవస్థ ఏర్పాటు చేయడం కోసం విప్లవ పందా మార్గంలో అందరం నడవాలని అన్నారు.
నిర్మల్: ఖానాపూర్ పట్టణం గాంధీ నగర్ కాలనీలోని బోరు చెడిపోయి ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న వార్డు కౌన్సిలర్ గొర్రె తిరుమల ఘటన స్థలానికి చేరుకుని దగ్గరుండి సిబ్బందితో బోరు రిపేర్ చేయించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
పాకిస్తాన్ క్రికెట్ టీమ్ హెడ్ కోచ్ మైక్ హెసన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రపంచకప్‌లలో ఓపెనర్‌గా పవర్ ప్లే సమయంలో బాబర్ ఆజం స్ట్రైక్ రేట్ 100 కంటే తక్కువగా ఉందని, ఇది ఆధునిక T20 ఫార్మాట్‌కు సరిపోదని పేర్కొన్నాడు. ‘జట్టుకు ఏం అవసరమో బాబర్‌కు తెలుసు. పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయలేనప్పుడు, మిడిల్ ఓవర్లలో జట్టును ఆదుకోవడం మంచిదని భావించాం’ అని తెలిపాడు.
CTR: కాణిపాకం వినాయక స్వామి దేవస్థానంలో ఆదివారం ప్రముఖులు ప్రత్యేక దర్శనం నిర్వహించారు.కేంద్ర మంత్రి రామ్మోహన్, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీ మోహన్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఈఓ పెంచల కిషోర్, ఛైర్మన్ మణి నాయుడు ఆలయ సంప్రదాయాల ప్రకారం వారికి ఘన స్వాగతం పలికి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఆదివారం ఉదయం శ్రీ కృష్ణాలంకారములో లక్ష్మీనరసింహస్వామి దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు పొన్న వాహన సేవ ఉండనుంది. స్వామివారి దర్శనానికి భక్తులు యాదగిరిగుట్టకు భారీగా తరలి వస్తున్నారు.
TG: కామారెడ్డి ఎమ్మెల్యేపై కాంగ్రెస్ నేతలే దాడిచేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. పోలీసులు కాంగ్రెస్, MIM పార్టీలకు కొమ్ముకాస్తున్నారని ఆరోపించారు. కామారెడ్డికి వెళ్లకుండా రాంచందర్ రావును హౌస్ అరెస్టు చేశారని, తమను ఎందుకు హౌస్ అరెస్టు చేశారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి, బాన్సువాడ ఘటనల్లో ప్రభుత్వ తీరును ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు.
ASF: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తాత్కాలికంగా నిలిపివేసిన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని రేపటి నుంచి తిరిగి ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కె.హరిత తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సముదాయంలో యథావిధిగా వినతుల స్వీకరణ ఉంటుందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు.