HYD: డా. బీ.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఇరిగేషన్ & సివిల్ సప్లైస్ శాఖలపై ప్రీ-బడ్జెట్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రాధాన్య కార్యక్రమాలు, సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, ఆహార భద్రతకార్డు, ఉచిత సన్న బియ్యం పథకం, తదితర వాటిపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
MDCL: మల్కాజ్‌గిరి నియోజకవర్గ అభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని, ప్రజలకు మెరుగైన వైద్యం, విద్య, క్రీడా, మౌలిక సదుపాయాలు అందించేందుకు నిరంతరం కృషి చేస్తున్నట్లు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. బుధవారం మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మాను చౌదరిని కలిసి నియోజకవర్గ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై వినతి పత్రాలను సమర్పించారు.
MDK: నర్సాపూర్ నియోజకవర్గంలోని పంట పొలాలకు సాగునీరు అందించేందుకు కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి హల్దీ ప్రాజెక్టుకు వెంటనే నీరు విడుదల చేయాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కోరారు. ఈ విషయమై ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో ఆమె ఫోన్లో మాట్లాడి అధికారిక లేఖను పంపారు. ఎమ్మెల్యే విజ్ఞప్తిపై మంత్రి సానుకూలంగా స్పందించారన్నారు.
GNTR: కలెక్టర్ తమీమ్ అన్సారియా బుధవారం తెనాలిలో విస్తృతంగా పర్యటించారు. బుర్రిపాలెంలోని టిడ్కో లేఔట్‌ను పరిశీలించి, నిర్మాణంలో ఉన్న 2,880 ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం మున్సిపల్ పరిధిలోని డంపింగ్ యార్డ్, ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రంతో పాటు మురుగునీటి శుద్ధి ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు సూచనలు చేశారు.
E.G: కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో కొవ్వూరు మున్సిపల్ ఛైర్ పర్సన్ భావన రత్నకుమారి, 3, 5, 19, 20వ వార్డు YCP కౌన్సిలర్లు బుధవారం టీడీపీలోకి చేరారు. రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో వారికి రాష్ట్ర TDP అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
ప్రకాశం: కనిగిరి మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం సీఐటీయూ మండల కన్వినర్ నరేంద్ర ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు నిరసన వ్యక్తం చేశారు. నరేంద్ర మాట్లాడుతూ.. మున్సిపల్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ ఏర్పాటు చేసి మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వమే నేరుగా జీతాలు చెల్లించే విధానం చేయాలన్నారు.
కోనసీమ: ఆలమూరు(మం) లంక గ్రామాలకు ఎంతో ప్రయోజనకరమైన చెముడులంక వంతెన అప్రోచ్ రోడ్డుకు రూ. 30 లక్షలు మంజూరయ్యాయి. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఈ నిధులను మంజూరు చేయించారు. ఏటిగట్టు అవతల ఉన్న బడుగువానిలంక గ్రామ ప్రజలతో పాటు, చెముడులంక, మడికి, పొట్టిలంక తదితర రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
KMM: రాష్ట్ర రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్‌ను బుధవారం హైదరాబాద్ సెక్రటేరియట్ నందు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఖమ్మం జిల్లాలో గౌడ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సంబంధించిన రూ. 5 కోట్ల నిధుల జీవో త్వరగా వచ్చేందుకు అన్ని విధాలుగా సహకరించిన సందర్భంగా ఆయనకు శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు.
VZM: పట్టణంలోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లపై పౌర సరఫరా అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న 19 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నామని డీఎస్వో మురళీనాధ్ తెలిపారు. ఏడు చోట్ల తనిఖీలు జరిపి 6-ఏ కేసులు నమోదు చేశామని, డొమెస్టిక్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
CTR: జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు, అదనపు ఎస్పీ శ్రీ రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సైబర్ నేరాలు, డిజిటల్ మోసాలు, రోడ్డు భద్రత, ధైర్య స్పర్శ చొరవపై దృష్టి సారించాయి. సురక్షితమైన ఆన్‌లైన్ పద్ధతులు, ట్రాఫిక్ నియమాలు, మాదకద్రవ్యాలకు దూరంగా ఉండటం వంటి క్రమశిక్షణ లక్షణాలు కలిగి ఉండాలన్నారు.
WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్య బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో కాంట్రాక్టర్ రాజ్యం నడిచిందని ఆరోపిస్తూ, ప్రస్తుతం ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు ప్రజల అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తున్నారని అన్నారు. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ పై పార్టీ మార్పులు, కమిషన్ ఆరోపణలతో విమర్శలు గుప్పించారు.
RR: ఫరూఖ్ నగర్ మండలం భీమారం గ్రామ పరిధిలో గల మోల్లోన్ గడ్డ తండాలో ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమాన్ని ఆదివాసి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు శీను నాయక్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన ప్రభుత్వంలో పేదల సొంతింటి కల సాధ్యం అవుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తోనే పేదల సంక్షేమం సాధ్యమని పేర్కొన్నారు.
కృష్ణా: గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ ను ఏలూరు రేంజ్ డీఐజీ అశోక్ కుమార్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్ లోని రికార్డులను డీఐజీ పరిశీలించి,రికార్డు నిర్వహణ ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని, కేసుల పరిష్కారంలో జాప్షం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు, డీఎస్పీ ధీరజ్ వినిల్, పాల్గొన్నారు.
GNTR: రాష్ట్ర ప్రభుత్వం జనన, మరణాల నమోదుపై జీవోఎంఎస్ 28 ద్వారా కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు కమిషనర్ మయూర్ అశోక్ బుధవారం తెలిపారు. జనన లేదా మరణం జరిగిన 21 రోజుల్లోపు ఉచితంగా నమోదు చేసుకోవచ్చని, ఆ తర్వాత నిర్ణీత ఫీజులు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఒకవేళ 21 రోజులు దాటితే, రూ. 25 అపరాధ రుసుముతో 30 రోజులలోపు నమోదు చేసుకోవచ్చని వివరించారు.
ప్రకాశం: చీమకుర్తిలో తూర్పు బైపాస్ రోడ్డు కూడలి నందు బుధవారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒంగోలు నుంచి శ్రీశైలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు బైక్ మీద వెళుతున్న రాజేశ్, కోటయ్యలను ఢీకొంది. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఈ ప్రాంతంలో రోడ్డు బాగా దెబ్బ తినటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు పేర్కొన్నారు.