TPT: కోమటిగుంటలో సిమెంట్ ఇటుకల పరిశ్రమ నుంచి వస్తున్న దుమ్ము, రసాయన వ్యర్థాల వల్ల కాలుష్యం పెరిగిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తూ రాస్తారోకో నిర్వహించారు. పరిశ్రమను మూసివేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు చేరుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
AKP: నక్కపల్లి మండలం తమ్మయ్యపేట గ్రామం వద్ద త్వరలో ప్రతిష్టాత్మక అర్సిలర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమం జరగనుంది. బుధవారం విశాఖపట్నం రేంజ్ ఐజీ గోపినాథ్ జట్టి, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సంయుక్తంగా క్షేత్రస్థాయిలో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరు కాబోతున్నారు.
విశాఖలోని తవ్వావానిపాలెంలో నిర్వహించిన ‘శ్రీశ్రీశ్రీ ముత్యాలమ్మతల్లి’ పండుగ మహోత్సవంలో మాజీ మంత్రి బూడి ముత్యాలనాయుడు, అన్నంరెడ్డి అదీప్ రాజ్, వైసీపీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం నిర్వహించిన ఎడ్లబండి పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు.
ATP: భారత సైన్యంలో విధులు నిర్వర్తిస్తూ వీరమరణం పొందిన హవిల్దార్ నరేష్ సాకే అంత్యక్రియలు బుధవారం గార్లదిన్నెలో అధికారిక లాంఛనాలతో జరిగాయి. అమర జవాను పార్థివ దేహానికి సైనిక అధికారులు, జిల్లా యంత్రాంగం గౌరవ వందనం సమర్పించి నివాళులర్పించారు. దేశ రక్షణలో ఆయన చేసిన త్యాగం మరువలేనిదని కొనియాడారు.
ASR: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించామని ఎంపీడీవో రమేష్ తెలిపారు. పలు శాఖల అధికారులు పాల్గొన్నారన్నారు. జిల్లాలో అనేక మంది గర్భిణులు, రోగులు రక్తం కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. అలాంటి వారి ప్రాణాలు కాపాడేందుకు రక్తదానం చేసేందుకు అందరూ ముందుకు రావాలన్నారు.
TPT: సత్యవేడు నియోజకవర్గంలోని బి.ఎన్. కండ్రిగ మండలానికి చెందిన యువ నాయకుడు కత్తి శివ, వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిను పులివెందులలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి సంబంధించిన పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. పులివెందులలో జరిగిన ఈ భేటీకి పార్టీ కార్యకర్తలు కూడా హాజరయ్యారు.
TPT: సత్యవేడు నియోజకవర్గంలోని ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాల భవనాలు శిధిలావస్థలో ఉన్నాయని, కొత్త భవనాలకు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరిట భవనాల నిర్మాణానికి కూడా నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు.
TPT: మార్కెట్‌లో 80% పైగా కల్తీ పన్నీర్ విక్రయిస్తున్నట్లు FSSAI గుర్తించింది. ఇవి జంతువులు తినడానికి కూడా సురక్షితం కాదట. మైదా హీరో రూట్ పౌడర్, కల్తీ పాలు, పామ్ ఆయిల్ నిల్వలతో వీటిని తయారు చేస్తున్నారట. తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తికి నిత్యం వేల మంది భక్తులు వస్తున్నారు. ఇక్కడి హోటళ్లలో అన్ బ్రాండెడ్ పనీర్ వినియోగిస్తున్నట్లు సమాచారం.
E.G: నిడదవోలు RTC డిపో వద్ద పట్టణ ప్రజల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంక్షేమ సంఘం అధ్యక్షులు రాంబాబు మాట్లాడుతూ.. నిడదవోలు RTC డిపోలో నాణ్యమైన బస్సులు నడపాలని డిమాండ్ చేశారు. అలాగే విజయవాడ నుంచి ఇచ్ఛాపురం వరకు సర్వీసులు నడపాలని, విద్యుత్ బస్సుల పేరుతో డిపోల మూసివేతను వ్యతిరేకించారు.
KDP: పోరుమామిళ్లలో ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న శ్రీ భాగ్యలక్ష్మి పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరపోగు రవి డిమాండ్ చేశారు. చదువు పేరుతో తల్లిదండ్రుల నుంచి భారీ ఫీజులు వసూలు చేస్తున్న పాఠశాలను సీజ్ చేయాలని ఆయన కోరారు. గుర్తింపు విషయంలో విద్యార్థులు, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
GNTR: చేబ్రోలు మండలం గుండవరం గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారి ఆలయ శంకుస్థాపన మహోత్సవం బుధవారం భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ పాల్గొని, ఆలయ జీర్ణోద్ధారణ పునర్నిర్మాణానికి సంబంధించిన ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
BPT: చీరాల బీచ్‌లో అక్షయ రిసార్ట్స్ సంస్థ ఫోర్ స్టార్ హోటల్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి ప్రోత్సాహకాలు మంజూరు చేసింది. ఎమ్మెల్యే కొండయ్య ప్రత్యేక కృషితో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందని ఆయన కార్యాలయం బుధవారం తెలిపింది. దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి పెరగడంతో పాటు చీరాల పర్యాటక రంగానికి కొత్త గుర్తింపు రానుంది. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి.
ప్రకాశం: 2019-24లో సీఎంగా ఉండుంటే 2021లోనే నీళ్ళు ఇచ్చేవాడినని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పుకొచ్చారు. గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి అలాగే ఉదయగిరి, బద్వేల్‌కు 4 లక్షల 35 వేల ఎకరాల సాగుకు నీళ్లు వచ్చుండేవి. ఆనాటి ముఖ్యమంత్రి దొంగ నాటకాలు ఆడి 2019-24 మధ్య కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని విమర్శించారు.
అన్నమయ్య: పాల డైరీ యాజమాన్యం డైరీ కేంద్రాల వద్ద తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని బుధవారం అన్నమయ్య జిల్లా రైతు సంఘం ప్రధాన కార్యదర్శి వంగవల రంగారెడ్డి సూచించారు. బుధవారం లక్కిరెడ్డిపల్లి ప్రాంతంలోని పాల డైరీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. డైరీలో భద్రతా ప్రమాణాలు నిర్లక్ష్యం చేస్తే రాజమండ్రిలో జరిగినట్లుగా సంఘటనలు చోటుచేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సత్యసాయి: పుట్టపర్తిలో ఖిద్మత్ ఎ ఖల్క్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముగ్గురు ఒంటరి మహిళలకు అడిషనల్ ఎస్పీ అంకిత సురాన కుట్టు మిషన్లు అందజేశారు. పద్మావతి, హరిత, అరుణమ్మ అనే మహిళల కుటుంబ పరిస్థితులను గమనించి ఈ సాయం చేశారు. ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అమోఘమని అడిషనల్ ఎస్పీ కొనియాడారు. భవిష్యత్తులోనూ ఇలాంటి సేవలు కొనసాగించాలని కోరారు.