Rs.2000: ఆర్బీఐ పాలసీ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో ఆర్బీఐ గవర్నర్ రూ.2000 నోట్లకు సంబంధించి కీలక సమాచారాన్ని అందించారు. బ్యాంకుల్లో నోట్ల డిపాజిట్, మార్పిడి గడువు మరికొద్ది గంటల్లో ముగియనున్న తరుణంలో ఈ సమాచారం అందింది. రూ.2000 నోట్లను మార్చుకునేందుకు, బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అక్టోబర్ 7వ తేదీ వరకు గడువు ఉంది. అంతకు ముందు ఈ గడువును సెప్టెంబర్ 30గా నిర్ణయించారు. తర్వాత అక్టోబర్ 7కి పెంచారు. మే 19న రూ.2000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించగా, మే 23 నుంచి ప్రక్రియ ప్రారంభమైంది. రూ.2000 నోటుకు సంబంధించి ఆర్బీఐ గవర్నర్ కీలకవ్యాఖ్యలు చేశారు.
2000 నోటుకు సంబంధించి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక సమాచారం ఇచ్చారు. మే నుంచి తిరిగి వచ్చిన రూ.3.43 లక్షల కోట్ల రూ.2000 నోట్లలో 87 శాతం బ్యాంకుల్లో డిపాజిట్ల రూపంలో వచ్చినవేనని ఆయన చెప్పారు. ఇప్పుడు కూడా రూ.12 వేల కోట్ల విలువైన రూ.2000 నోట్లు మార్కెట్లో స్తంభించిపోయాయని, మళ్లీ బ్యాంకింగ్ వ్యవస్థలోకి రాలేదన్నారు. బ్యాంకులు సైతం ఈ నోట్ల కోసం ఎదురుచూస్తున్నాయి. రూ.12 వేల కోట్లు తక్కువేం కాదు. అక్టోబర్ 7 తర్వాత ఈ డబ్బు ఏమవుతుంది అనేది అతిపెద్ద ప్రశ్న. ఈ డబ్బు వృథా అవుతుందా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు అందరి మదిలో మెదులుతున్నాయి.
రేపటి తర్వాత ఏం జరుగుతుంది?
అక్టోబర్ 7, 2023 తర్వాత 19 RBI ఇష్యూ కార్యాలయాల్లో మాత్రమే రూ.2000 బ్యాంక్ నోట్ల మార్పిడికి అనుమతి ఉంటుంది. ఒక్కో లావాదేవీకి గరిష్టంగా రూ.20,000 నోట్ల నగదు డిపాజిట్ పరిమితి ఉంటుంది. RBI 19 ఇష్యూ కార్యాలయాల్లో వ్యక్తులు లేదా సంస్థలు తమ భారతీయ బ్యాంకు ఖాతాల్లోకి ఎంత మొత్తమైనా జమ చేయడానికి రూ. 2000 బ్యాంకు నోట్లను జారీ చేయవచ్చు. పోస్టల్ శాఖ ద్వారా ఈ నోట్లను ఆర్బీఐకి పంపే సదుపాయం కూడా ఉంది.