RBI : 97.62 శాతం రూ.2000 నోట్లు మాత్రమే తిరిగొచ్చాయి.. మిగతావి ఎక్కడ ?
రూ.2000 విలువైన నోట్లలో దాదాపు 97.62 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చేశాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుతం రూ.8,470 కోట్ల నోట్లు మాత్రమే ప్రజల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపింది.
RBI : రూ.2000 విలువైన నోట్లలో దాదాపు 97.62 శాతం బ్యాంకులకు తిరిగి వచ్చేశాయని ఆర్బీఐ శుక్రవారం వెల్లడించింది. ప్రస్తుతం రూ.8,470 కోట్ల నోట్లు మాత్రమే ప్రజల వద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపింది. మే 19, 2023న రూ. 2,000 డినామినేషన్ బ్యాంకు నోట్లను చెలామణి నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఆ తర్వాత ఈ నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని లేదా ఇతర విలువల నోట్లతో మార్చుకోవాలని సూచించింది. మే 19, 2023న వ్యాపారం ముగిసే సమయానికి మొత్తం రూ.3.56 లక్షల కోట్ల రూ.2,000 నోట్లు చెలామణిలో ఉన్నాయని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 29, 2024న వ్యాపారం ముగిసే సమయానికి ఈ డినామినేషన్లో చెలామణిలో ఉన్న నోట్ల విలువ రూ.8,470 కోట్లకు తగ్గింది. ఈ విధంగా చలామణిలో ఉన్న రూ.2000 నోట్లు మొత్తం 97.62 శాతం వెనక్కి వచ్చాయి.
దీంతో పాటు రూ.2000 నోట్లు చట్టబద్ధంగానే ఉంటాయని ఆర్బీఐ స్పష్టం చేసింది. RBI దేశవ్యాప్తంగా ఉన్న తన 19 కార్యాలయాల్లో రూ.2,000 నోటును డిపాజిట్ చేసే లేదా మార్చుకునే సదుపాయాన్ని కల్పిస్తూనే ఉంది. ప్రజలు ఈ నోట్లను ఏదైనా పోస్టాఫీసు నుండి ఆర్బిఐకి చెందిన ఏదైనా కార్యాలయానికి ఇండియా పోస్ట్ ద్వారా పంపవచ్చు. ప్రజలు, ఇతర సంస్థలు సెప్టెంబర్ 30, 2023 వరకు బ్యాంకులను సందర్శించడం ద్వారా ఈ నోట్లను మార్చుకోవచ్చు లేదా డిపాజిట్ చేసుకోవచ్చని ఆర్బిఐ గతంలో తెలిపింది. తర్వాత గడువును అక్టోబర్ 7, 2023 వరకు పొడిగించారు. అయితే, అక్టోబర్ 8, 2023 నుండి, ప్రజలు 19 RBI కార్యాలయాలలో కరెన్సీని మార్చుకోవడానికి లేదా వారి బ్యాంక్ ఖాతాలలో మొత్తాన్ని డిపాజిట్ చేయడానికి అవకాశం ఇవ్వబడింది. ఈ సదుపాయం అహ్మదాబాద్, బెంగళూరు, బేలాపూర్, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, జైపూర్, జమ్ము, కాన్పూర్, కోల్కతా, లక్నో, ముంబై, నాగ్పూర్, న్యూఢిల్లీ, పాట్నా, తిరువనంతపురంలోని RBI కార్యాలయాలలో అందుబాటులో ఉంది.