»Psbs Top Private Banks Collected Over Rs 35000 Crore In Penalties Since 2018 Details Inside
Bank Charges:ఐదేళ్లలో జనాల దగ్గర్నుంచి రూ.35వేల కోట్లు వసూలు చేసిన బ్యాంకులు
2018 సంవత్సరం నుండి, వివిధ ఛార్జీలు, జరిమానాలు, సేవల పేరిట బ్యాంకులు తమ కస్టమర్ల నుండి రూ. 35,000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోవడం, ATMలు, SMS సేవల ద్వారా అదనపు లావాదేవీలు వంటి ఖర్చుల ఖాతాలో ఈ ఛార్జీలు ఉంటాయి.
Bank Charges:గతంలో ఇంట్లో డబ్బులు ఉంచుకుంటే దొంగలు కొట్టేస్తారని బ్యాంకుల్లో దాచుకునే వారు. కానీ ఇప్పుడు బ్యాంకుల్లో కూడా సంపాదించిన డబ్బులకు భద్రతల లేదు. పైగా అందులో డబ్బులు దాచుకున్నందుకు బ్యాంకులు వినియోగదారుల నుంచి ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నాయి. 2018 సంవత్సరం నుండి, వివిధ ఛార్జీలు, జరిమానాలు, సేవల పేరిట బ్యాంకులు తమ కస్టమర్ల నుండి రూ. 35,000 కోట్లకు పైగా వసూలు చేశాయి. ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోవడం, ATMలు, SMS సేవల ద్వారా అదనపు లావాదేవీలు వంటి ఖర్చుల ఖాతాలో ఈ ఛార్జీలు ఉంటాయి. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో తెలియజేసింది.
ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం.. గత ఐదేళ్లలో ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు ఇంత భారీ మొత్తాన్ని లాక్కున్నాయి. ప్రభుత్వ బ్యాంకులే కాకుండా యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐడిబిఐ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకులు ఉన్నాయి. ఆర్థిక (రాష్ట్ర) మంత్రి భగవత్ కరాద్ రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం ఇచ్చారు. ఈ బ్యాంకులు ఖాతాలో మినిమమ్ బ్యాలెన్స్ నిర్వహించకపోవడంతో మొత్తం రూ.21,044.4 కోట్లు వసూలు చేశాయి. ఇది కాకుండా అదనపు ఏటీఎం లావాదేవీల కోసం రూ.8,289.3 కోట్లు, ఎస్ఎంఎస్ సేవల కోసం రూ.6,254.3 కోట్లు వసూలు చేశారు. ఏప్రిల్ 1, 2015 నుండి సేవింగ్స్ ఖాతాలో కనీస నిల్వ పరిమితిని బ్యాంకులు విధించాయి. దీని ప్రకారం బ్యాంకు ఖాతాలో సదరు బ్యాంకు నిర్ణయించిన బ్యాలెన్స్ తప్పనిసరిగా ఉండాలి.. లేనిచో బ్యాంకులు కస్టమర్లకు జరిమానా విధించవచ్చు.
అన్ని రకాల లావాదేవీల కోసం బ్యాంకులు ఆన్లైన్ అలర్ట్ సదుపాయాన్ని అందించాల్సి ఉంటుందని ఆర్బీఐ సర్క్యులర్లో పేర్కొంది. సేవింగ్స్-బ్యాంక్ ఖాతాదారులు ఎటువంటి ఛార్జీలు చెల్లించకుండా 5 సార్లు ATM లావాదేవీలు చేయవచ్చు. ఈ పరిమితికి మించిన ATM లావాదేవీలపై అదనపు ఛార్జీలు చెల్లించాలి. ఇతర బ్యాంకుల ATMల నుండి లావాదేవీ పరిమితి 3 రెట్లు. నాన్-మెట్రో నగరాలకు ఈ పరిమితి 5గా నిర్ణయించాయి. ఆ తర్వాత ప్రతి లావాదేవికి రూ.21అదనంగా చెల్లించాలి.