Bomb threats: దేశంలో పలు విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు రావడంతో తీవ్ర కలకలం రేపింది. ఈ బాంబు బెదిరింపులు దేశ రాజధాని ఢిల్లీ సహా 7 విమానాశ్రయాలకు వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు విమానాశ్రయాలపై బాంబులు వేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఢిల్లీ, జైపూర్, లక్నో, చండీగఢ్, ముంభై, చెన్నై, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులపై బాంబు దాడి చేయబోతున్నామని ఈ మెయిల్ ద్వారా బెదిరించారట. అధికారులు వెంటనే అప్రమత్తమై స్థానిక పోలీసుల సాయంతో ఆయా విమానాశ్రయాల్లో తనిఖీలు చేపట్టారు. ఎక్కడ కూడా పేలుడు పదార్థాలు కనిపించలేదని తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
అలాగే నిన్న ముంబైలోని పలు బ్యాంకులకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకులకు ఖిలాఫత్ ఇండియా మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. ప్రైవేటు బ్యాంకులు ఆర్బీఐతో కలిసి భారీ కుంభకోణానికి పాల్పడ్డాయని.. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, కొందరు బ్యాంకు ఉన్నతాధికారులు, ప్రముఖ మంత్రుల పాత్ర ఉన్నదని పేర్కొన్నారు. ఆర్బీఐ గవర్నర్, ఆర్థిక మంత్రి రాజీనామా చేసి కుంభకోణంపై ప్రకటన చేయకుంటే ఒక దాని తర్వాత ఒకటి బాంబులు పేలుస్తామన్నారు. దీంతో పోలీసులు తనిఖీ దళాలతో సోదాలు చేశారు. అయితే ఇక్కడ కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు.