Hand over Lashkar-e-Taiba founder Hafiz Muhammad Saeed to India
Hafiz Muhammad Saeed: అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) వ్యవస్థాపకుడు హఫీజ్ ముహమ్మద్ సయీద్ (Hafiz Saeed)ను భారత్ కు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హఫీజ్‌ను భారత్‌కు అప్పగించాలని పాకిస్థాన్‌ను ఇండియా అధికారికంగా అడిగినట్లు పలు జాతీయ మీడియా కథనాలు ప్రచురిస్తున్నాయి. హఫీజ్‌ను అప్పగించేందుకు చట్టపరమైన ప్రక్రియను ప్రారంభించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. పాక్ ప్రభుత్వానికి అధికారిక అభ్యర్థనను పంపినట్లు వార్తలు వస్తున్నప్పటికీ అధికారిక ప్రకటన అయితే లేదు. ఇది వరకే చాలా సార్లు హఫీజ్‌ను అప్పగించాలని భారత్ ప్రకటించింది.
2008 ముంబయిలో జరిగిన ఉగ్రదాడుల్లో హఫీజ్ సయీద్ ప్రధాన నిందితుడు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకడు. ఐక్యరాజ్య సమితి కూడా అతన్ని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అతడి తలపై అమెరికా 10 మిలియన్ డాలర్ల రివార్డ్ ప్రకటించింది. వీటితోపాటు పలు మనీలాండరింగ్ కేసుల్లోనూ హఫీజ్‌పై ఎన్నో కేసులు ఉన్నాయి. ముంబాయిలో దాడులకు కారణమైన హఫీజ్‌ను భారత్‌కు అప్పగించమని భారత్ ఎన్నోసార్లు డిమాండ్ చేసింది. కానీ భారత్, పాకిస్థాన్‌ల నడుమ అలాంటి ఒప్పందం లేదు. దాంతో పాకిస్థాన్ సహకరించలదే. తరువాత ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారన్న పలు కేసుల్లో 2019లో హఫీజ్‌ను పాకిస్థాన్ అరెస్ట్ చేసింది. 31 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ప్రస్తుతం హఫీజ్ జైలు నుంచే దేశరాజకీయాలను శాసిస్తున్నట్లు పలు కథనాలు వస్తున్నాయి. తాను ఏర్పాటు చేసిన ‘ది పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్’ (పీఎంఎంఎల్) పార్టీ ఎన్నికల్లో పోటీకి సిద్ధం అయింది. దీని తరఫున హఫీజ్ తనయుడు తల్హా సయీద్ ఎన్ఏ-127 స్థానం నుంచి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.