రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డీమెర్జ్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ యూనిట్ బోర్డులో ముకేశ్ అంబానీ కుమార్తె ఇషా, మాజీ CAG రాజీవ్ మెహ్రిషి డైరెక్టర్లుగా నియమితులైనట్లు కంపెనీ జూలై 8న పేర్కొంది. అయితే ఈ సంస్థను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్(Jio Financial Services)గా మార్చేందుకు ఈ మేరకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
రిలయన్స్ నుంచి మరో సంస్థ వెలుగులోకి రాబోతుంది. రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ (RSIL)ను జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL)గా పేరు మార్చడానికి ఈ మేరకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాటు కానున్న రిలయన్స్ ఆర్థిక విభాగం.. వినియోగదారులకు వ్యాపారులకు రుణాలిచ్చేందుకు సిద్ధమవుతుంది. దీంతోపాటు బీమా, చెల్లింపులు, డిజిటల్ బ్రోకింగ్, అసెట్ మేనేజ్మెంట్ సర్వీసులను కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. వివరాల ప్రకారం ప్రతి రిలయన్స్ షేర్‌హోల్డర్ పేరెంట్లో ఉన్న ప్రతి షేరుకు కొత్త సంస్థలో ఒక వాటాను పొందనున్నారు. ఈ కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్ ప్రకారం కొత్త కంపెనీ షేర్లను కేటాయించడానికి సంస్థ జూలై 20ని రికార్డ్ డేగా నిర్ణయించింది.
JFSL 428 మిలియన్ల వినియోగదారులతో భారతదేశపు అతిపెద్ద వైర్లెస్ ఆపరేటర్, 17,000 స్టోర్లతో అగ్రశ్రేణి రిటైల్ చైన్‌ను కలిగి ఉన్న రిలయన్స్ వినియోగదారు వ్యాపారాలను పూర్తి చేయనుంది. జూలై 7న జరిగిన సమావేశంలో కొత్త కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఇషా ముఖేష్ అంబానీని నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఆమోదించగా, రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ అన్షుమన్ ఠాకూర్ కూడా నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. హోంశాఖ కార్యదర్శిగా, కాగ్‌గా పనిచేసిన మాజీ బ్యూరోక్రాట్ రాజీవ్ మెహ్రిషి ఐదేళ్లపాటు ఆర్ఎస్ఐఎల్లో స్వతంత్ర డైరెక్టర్‌గా నియమితులయ్యారని పేర్కొంది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సునీల్ మెహతా, పీడబ్ల్యూసీలో పనిచేసిన చార్టర్డ్ అకౌంటెంట్ బిమల్ మను తన్నా స్వతంత్ర డైరెక్టర్లుగా నియమితులయ్యారు. డైరెక్టర్ల నియామకం ఆర్ఎస్ఐఎల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) సభ్యుల ఆమోదానికి లోబడి ఉంటుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం పొందిన తేదీ నుంచి ఇది అమలులోకి రానుంది.