»India Sri Lanka Passenger Ferry Service Begins Again After 40 Years
Ferry Service: 40ఏళ్ల తర్వాత భారత్ – శ్రీలంకల మధ్య ప్రారంభమైన ప్యాసింజర్ నౌక
దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తమిళనాడు తూర్పు తీరంలోని నాగపట్నం -శ్రీలంక ఉత్తర ప్రావిన్స్‌లోని కంకేసంతురై మధ్య అంతర్జాతీయ, హై-స్పీడ్ ప్యాసింజర్ ఫెర్రీ సర్వీస్ శనివారం పునఃప్రారంభమైంది.
Ferry Service: దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత తమిళనాడు తూర్పు తీరంలోని నాగపట్నం -శ్రీలంక ఉత్తర ప్రావిన్స్‌లోని కంకేసంతురై మధ్య అంతర్జాతీయ, హై-స్పీడ్ ప్యాసింజర్ ఫెర్రీ సర్వీస్ శనివారం పునఃప్రారంభమైంది. కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్, తమిళనాడు పబ్లిక్ వర్క్స్, హైవేస్, మైనర్ పోర్టుల మంత్రి ఈవీ వేలు శనివారం నాగపట్నం ఓడరేవు నుండి నౌకను జెండా ఊపి ప్రారంభించారు. కెప్టెన్ బిజు జార్జ్ నేతృత్వంలోని హై-స్పీడ్ క్రాఫ్ట్ (HSC) చెరియపాణి 50 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బందితో ఉదయం 8.15 గంటలకు నాగపట్నం ఓడరేవు నుండి బయలుదేరారు.
వీడియోలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ -శ్రీలంక అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘే దౌత్య ప్రయత్నాన్ని ప్రశంసించారు. రెండు దేశాల మధ్య ఫెర్రీ సర్వీస్‌ను ప్రారంభించడం ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. భారత్ శ్రీలంక మధ్య దౌత్య, ఆర్థిక సంబంధాలలో ఇది కొత్త అధ్యాయంగా అభివర్ణించిన ప్రధాని నరేంద్ర మోడీ, రెండు దేశాల మధ్య సాంస్కృతిక, వాణిజ్య, నాగరికత సంబంధాలను బలోపేతం చేయడానికి ఫెర్రీ సర్వీస్ సహాయపడుతుందని అన్నారు. భారత్-శ్రీలంక ఆర్థిక భాగస్వామ్య ఉమ్మడి దృష్టిలో కనెక్టివిటీ ప్రధాన అంశం అని మోడీ అన్నారు. రామేశ్వరం – తలైమన్నార్ మధ్య ఫెర్రీ సేవలను తిరిగి ప్రారంభించేందుకు భారతదేశం కూడా చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఇరు దేశాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరిచేందుకు ఇదొక ముఖ్యమైన ముందడుగు అని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. రెండు దేశాల ప్రజలు చాలా ఏళ్లుగా పాక్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్నారని, శ్రీలంకలో అంతర్యుద్ధం కారణంగా గతంలో నడిచే ఫెర్రీ సర్వీసులను నిలిపివేసినట్లు చెప్పారు. ఇప్పుడు కనెక్టివిటీ తిరిగి స్థాపించబడిందని పేర్కొన్నారు.
Strengthening 🇮🇳-🇱🇰 ties via coastal connectivity!
Delighted to launch Nagapattinam (India) – Kankesanthurai (Sri Lanka) first International Passenger Ferry Service from Nagapattinam Port in Tamil Nadu.
టిక్కెట్లను విక్రయించేందుకు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఓ ప్రైవేట్ ఏజెన్సీని నియమించింది. ఈ నౌకలో 150 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. నాగపట్నం నుండి ఉదయం 7 గంటలకు బయలుదేరి 11 గంటలకు కంకేసంతురై చేరుకుంటుంది. తిరుగు ప్రయాణం మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. కంకేసంతురై వద్ద సాయంత్రం 5.30 గంటలకు నాగపట్నం చేరుకుంటుంది. ప్రయాణానికి వన్-వే టిక్కెట్ ధర సుమారు రూ.7,670. ప్రతి ప్రయాణీకుడు 50 కిలోల లగేజీని ఆన్‌బోర్డ్‌లో తీసుకెళ్లవచ్చు.