Gold and Silver Rates Today : బంగారం, వెండి ధరలు రోజు రోజుకూ ఆకాశాన్ని అంటున్నాయి. రెండు, మూడు రోజుల పాటు వరుసగా అరకొరగా తగ్గుతున్న వీటి ధరలు ఒక్కరోజే భారీగా పెరిగిపోతున్నాయి. దీంతో సరాసరిన చూసుకున్నట్లైతే బంగారం, వెండి కూడా పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. గత రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టి ఊరించిన వీటి ధరలు శనివారం ఒక్కరోజే భారీగా పెరిగిపోయాయి. దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల పసిడి ధర నేడు రూ.740 పెరిగింది. దీంతో బంగారం ధర నేడు రూ.74,240కి చేరుకుంది.
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన విజయవాడ, హైదరాబాల్లోనూ పది గ్రాముల పసిడి ధర(Gold Rate) రూ.74,240గా కొనసాగుతోంది. ఈ ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభ సమయంలో ఉన్నవి. తర్వాత మళ్లీ వీటిల్లో హెచ్చు తగ్గులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. నగలు కొనుక్కునే వారు ఈ ధరకు అదనంగా జీఎస్టీ, మజూరీల్లాంటివి కూడా చెల్లించాల్సి ఉంటుంది.
దేశీయ మార్కెట్లలో వెండి ధర(Silver Rate)లు సైతం శనివారం భారీగా పెరిగిపోయాయి. కిలో వెండి ధర నేడు రూ.1040 పెరిగింది. దీంతో దీని ధర నేడు రూ.90,690కు చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విజయవాడ లాంటి చోట్ల కూడా వెండి ధరలు దాదాపుగా ఇలాగే ఉన్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్, సిల్వర్ ధరలు సైతం నేడు భారీగా పెరిగిపోయాయి. స్పాట్ గోల్డ్ నేడు 27 డాలర్లు పెరిగింది. దీంతో ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 2333 డాలర్లకు చేరింది. ఔన్సు వెండి ధర 29.57 డాలర్లుగా ఉంది.