హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక నేపథ్యంలో అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు కుప్పకూలుతున్నాయి. భారత స్టాక్ మార్కెట్లో అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్ శుక్రవారం ఏకంగా 15 శాతానికి పైగా నష్టపోయింది. సరిగ్గా నెల రోజుల క్రితం రూ.4000కు సమీపంలో ఉన్న ఈ స్టాక్ ఇప్పుడు రూ.1330 వద్ద ట్రేడ్ అవుతోంది. నెల రోజుల్లో 65 శాతానికి పైగా, గత వారం రోజుల్లో 56 శాతానికి పైగా కుప్పకూలింది. ఉదయం గం.11 సమయంలో ఓసారి రూ.1000 స్థాయికి పతనమైనప్పటికీ, కాస్త కోలుకుంది. డిసెంబర్ నెల నుండి అదానీ సంపద 76 శాతం పడిపోవడం గమనార్హం. డిసెంబర్ 2022లో ఈ కంపెనీ స్టాక్ పీక్ స్టేజీలో రూ.4190 వద్ద ట్రేడ్ అయింది. ఇప్పుడు రూ.1300 స్థాయి అంటే మూడొంతులు నష్టపోయింది. భారత మార్కెట్లో అస్థిరతను తీసుకురావడానికి తమను టార్గెట్ చేసినట్లు అదానీ ఆరోపిస్తోంది. అదానీ షేర్ల పతనం కొనసాగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లలో విశ్వాసం నింపేందుకు గౌతమ్ అదానీ పలు చర్యలకు ఉపక్రమించారు.
రుణదాతలతో చర్చలు జరిపారని తెలుస్తోంది. రుణ చెల్లింపులు ముందుగానే చేసి, తనఖా పెట్టిన షేర్లను విడిపించుకునే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే షేర్లు భారీగా పతనమైన సమయంలో రుణదాతలు హెచ్చరికగా మార్జిన్ కాల్స్ జారీ చేస్తారు. అప్పుడు అదనంగా నగదు లేదా సెక్యూరిటీని డిపాజిట్ చేయాలి. ఇప్పటి వరకు అయితే ఏ కంపెనీ అదానీ గ్రూప్ కంపెనీలకు మార్జిన్ కాల్ ఇవ్వలేదని సమాచారం. హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ పైన ఇప్పటికే స్పందించిన అదానీ గ్రూప్… ఈ రోజు మరోసారి స్పందించవచ్చు. ఇదిలా ఉండగా, అదానీ ఎంటర్ ప్రైజెస్‌ను సస్టెనబిలిటీ సూచీ నుండి తొలగిస్తున్నట్లు అమెరికాకు చెందిన ఎస్ అండ్ పీ డౌజోన్స్ తెలిపింది. ఇందుకు అనుగుణంగా సస్టెనబిలిటీ సూచీకి ఫిబ్రవరి 7వ తేదీన సవరణలు చేయనున్నట్లు తెలిపింది. ఈ గ్రూప్‌ను సస్టెనబిలిటీ ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో డిసెంబర్ 19, 2022లో జత చేశారు.