విశాఖపట్నంలో జరిగిన బహిరంగ సభలో జగన్ ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా(amit shah) చేసిన వ్యాఖ్యలపై తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్, వైఎస్సార్సీపీ ప్రముఖ నేత వైవీ సుబ్బారెడ్డి(YV Subba Reddy)స్పందించారు. విశాఖపట్నంలోని జ్ఞానపురంలో ఎర్నిమాంబ ఆలయ జీర్ణోద్ధరణ, ఆలయ ప్రతిష్ఠాపన కార్యక్రమంలో వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ, బీజేపీ రెండూ పార్టీలు కూడా అవినీతికి పాల్పడ్డాయని ఆరోపించారు. ఈ సందర్భంగా 2014 నుంచి 2019 వరకు టీడీపీ బీజేపీల మధ్య గత పొత్తును గుర్తు చేశారు.
టీడీపీ(TDP) చేస్తున్న అన్యాయానికి బీజేపీ(BJP) బాధ్యత నుంచి తప్పుకోవాలని కోరారు. మరోవైపు రెండు పార్టీల మధ్య సన్నిహిత సంబంధాన్ని సూచిస్తూ, బీజేపీ వేదికపై TDP నాయకులు ఉన్నారెంటని ప్రశ్నించారు. కేంద్ర హోంమంత్రి వారి సొంత విజయాలను వివరిస్తే తాము, ఇతరులు సంతోషించేవారని అన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్న సమయంలో రాష్ట్రానికి బీజేపీ ఏం చేసిందన్న ప్రశ్నకు సమాధానం చెప్పాలని షాను నిలదీశారు. టీడీపీ ట్రాప్ లో బీజేపీ పడిందని…కాషాయ కండువాలకు బదులు పసుపువి వేసుకొని వేదికపై మాట్లాడవలసిందని అభిప్రాయం వ్యక్తం చేశారు. నరేంద్ర మోదీ తొమ్మిదేళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏం చేసిందో బీజేపీ చెప్పి సంబరాలు చేసుకుంటే బాగుండేదని వైవీ సుబ్బారెడ్డి అన్నారు. 2014 ఎన్నికల హామీలు ఏమయ్యాయో అమిత్ షా చెప్పాలన్నారు. స్టీల్ ప్లాంట్ కోసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా 20 పార్లమెంట్ స్థానాలు కావాలని ఓటర్లను ఎలా అడుగుతారని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నించారు.