Amit Shah said that Congress does not have the courage to do surgical strikes
Amit Shah : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారీ చర్యలకు సిద్ధమైంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ నిరంతరంగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. జమ్మూకశ్మీర్ భద్రతపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హోంశాఖ సీనియర్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమయంలో అమిత్ షా లోయలో పరిస్థితులపై ఆరా తీశారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవటానికి తీసుకోవాల్సిన చర్యలపై కూడా చర్చించారు.
జమ్మూ కాశ్మీర్ భద్రతపై సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి జూన్ 16న భారీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ అత్యున్నత స్థాయి సమావేశంలో కూడా లోయ భద్రత, అమర్నాథ్ యాత్ర భద్రతపై కూలంకషంగా చర్చించనున్నారు. ఈ సమావేశానికి ఎన్ఎస్ఎ అజిత్ దోవల్, ఐబి చీఫ్, జమ్మూ కాశ్మీర్ ఎల్జి మనోజ్ సిన్హా, డిజి పారామిలిటరీ ఫోర్సెస్ వంటి సీనియర్ అధికారులు కూడా హాజరుకానున్నట్లు సమాచారం.
పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా
అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోదీ కూడా లోయలో పరిస్థితిపై ఉన్నత స్థాయి సమావేశాన్ని పిలిచారు. ప్రధాని మోదీ తన బృందాన్ని అప్రమత్తం చేశారు. లోయలో భద్రతపై ప్రధాని మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి, తీవ్రవాదంపై తమ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాలని సాయుధ బలగాలను ఆదేశించారు. లోయలో పరిస్థితిని గమనించిన ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రితో మాట్లాడిన సందర్భంగా భద్రతా బలగాల మోహరింపుకు సంబంధించి సూచనలు చేశారు. గ్రౌండ్ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి, ప్రధానమంత్రి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కూడా మాట్లాడారు.
రియాసి, కథువా, దోడాలలో తీవ్రవాద దాడి
గత నాలుగు రోజుల్లో జమ్మూ కాశ్మీర్‌లోని రియాసి, కథువా, దోడా అనే నాలుగు చోట్ల ఉగ్రవాదులు దాడులు చేశారు. ఈ దాడిలో 9 మంది యాత్రికులు కాకుండా, ఒక సీఆర్పీఎఫ్ జవాన్ చనిపోయారు. ఏడుగురు భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారు. అయితే ఆర్మీ ఆపరేషన్‌లో కథువాలో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. రెండు దాడుల్లో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల స్కెచ్లను కూడా పోలీసులు విడుదల చేశారు. వారి గురించి సమాచారం అందించిన వారికి 20 లక్షల రూపాయల రివార్డును ప్రకటించారు.