Fire Accident : ఉత్తరప్రదేశ్లోని మధురలో ఘోర ప్రమాదం జరిగింది. వెండి ఆభరణాల తయారీ ఫ్యాక్టరీలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించడంతో పాటు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
ఈ ప్రమాదం జరిగిన భవనం పైన ప్రత్యక్ష సాక్షి దేవకీనందన్ నివసిస్తున్నాడు. పేలుడు చాలా శక్తివంతమైనదని, భవనం మొత్తం కంపించిందని అతను చెప్పాడు. ఫ్యాక్టరీలో వెండి వస్తువులు తయారు చేస్తారు. పేలుడు ధాటికి కిటికీలు, తలుపులు కూడా పగిలిపోయాయి. అనేక సిలిండర్లు కూడా ఫ్యాక్టరీలో ఉన్నాయి. ఇక్కడ చాలా కాలంగా అక్రమ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రమాదం జరిగినప్పుడు చాలా మంది కార్మికులు ఫ్యాక్టరీ లోపల పని చేస్తున్నారు.
విచారణలో పోలీసులు నిమగ్నం
ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు ఎవరూ మృతి చెందినట్లు సమాచారం లేదు. క్షతగాత్రులకు చికిత్స అందించేందుకు ప్రత్యేక బృందాన్ని ఆస్పత్రిలో నియమించారు. ఘటనపై సమాచారం తెలుసుకునేందుకు పోలీసులు ఆస్పత్రికి వెళ్లి మంటల్లో కాలిపోయిన కార్మికులను విచారిస్తున్నారు. ఈ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని చూడగా పేలుడు ధాటికి భవనం శిథిలాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ః
ఢిల్లీలో పేలుడు
కొద్ది రోజుల క్రితమే రాజధాని ఢిల్లీలో మరో బాయిలర్ పేలుడు ఘటన వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫుడ్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. అగ్నిప్రమాదానికి బాయిలర్ పేలడమే కారణమని తెలిపారు.