ఆధ్యాత్మిక క్షేత్రం శ్రీశైలం ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం తప్పింది. ఘాట్ దిగుతున్న సమయంలో తెలంగాణ ఆర్టీసీ బస్సు వేగాన్ని నియంత్రించుకోలేకపోవడంతో డ్యామ్ రక్షణ గోడను ఢీకొట్టింది. రక్షణ గోడ కూలిపోగా అక్కడే ఉన్న ఇనుప రాడ్ అడ్డు పడడంతో బస్సు ఆగిపోయింది. లేకుంటే బస్సు నేరుగా శ్రీశైలం డ్యామ్ లోకి పడిపోయి ఉండేది. ఈ ఘటనతో బస్సులోని 30 మంది ప్రయాణికులు భయాందోళన చెందారు. బస్సు ఆగిపోవడంతో దేవుడా అంటూ ఊపిరి పీల్చుకున్నారు. శ్రీశైలం మల్లన్నే తమను కాపాడాడని భక్తులు తెలిపారు.
శ్రీశైలం నుంచి మహబూబ్ నగర్ వెళ్తున్న తెలంగాణ ఆర్టీసీ బస్సు ఘాట్ రోడ్డు దిగుతున్నది. దిగే సమయంలో బస్సు వేగాన్ని డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతో బస్సు వేగంగా వెళ్లి డ్యామ్ రక్షణ గోడను ఢీకొట్టింది. గోడ పగిలిపోయినప్పటికీ అక్కడే రక్షణగా ఉన్న ఇనుప బారీకేడ్ బస్సును నియంత్రించింది. దీంతో బస్సులోని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం వలన ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద ఎత్తున కార్లు, బస్సులు నిలిచిపోయాయి. అసలే వారాంతం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవడంతో వాహనాలు సజావుగా రాకపోకలు సజావుగా సాగాయి.