ఈరోజే త్రిపుర అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతుంది. 60 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై..రాత్రి ఏడు గంటల వరకు కొనసాగనుంది. మార్చి 2న ఓట్ల లెక్కింపు ఫలితాలను ప్రకటించనున్నారు.
ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలోని 60 మంది సభ్యుల అసెంబ్లీకి ఈరోజు(ఫిబ్రవరి 16న) ఎన్నికల ఓటింగ్ జరుగుతుంది. మార్చి 2న ఓట్ల లెక్కింపు ఫలితాలను వెల్లడించనున్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగనుంది. ఇప్పటికే ఓటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగేందుకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు సబ్బందితోపాటు స్థానిక యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
మొత్తం 259 మంది
ఇక ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ (BJP), దాని మిత్రపక్షమైన ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (IPFT) కలసి పోటీ చేస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్-సీపీఐ(ఎం), ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ), ప్రాంతీయ పార్టీ టిప్రా మోతాలు ప్రధానంగా బరిలో ఉన్నాయి. ఆయా పార్టీలు తమకే మెజారిటీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. BJP 55 స్థానాల్లో పోటీ చేస్తుండగా, దాని మిత్రపక్షమైన ఐపిఎఫ్టి మిగిలిన ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది. త్రిపురలోని 60 నియోజక వర్గాల్లో 42 స్థానాల్లో పోటీ చేయాలని స్థానిక పార్టీ టిప్రా మోతా నిర్ణయించుకుంది. మరోవైపు దాదాపు 20 గిరిజనుల ఆధిపత్య స్థానాలు ఉండగా..ఇవి ఈశాన్య రాష్ట్రంలో అధికారానికి కీలకం కానున్నాయి. సీపీఐ(ఎం) 43 స్థానాల్లో, దాని లెఫ్ట్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీలైన ఫార్వర్డ్ బ్లాక్, ఆర్ఎస్పీ, సీపీఐ ఒక్కొక్కటి చొప్పున పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్ 13, తృణమూల్ కాంగ్రెస్ 28, స్వతంత్ర అభ్యర్థులు 58 మంది పోటీ చేస్తున్నారు. మొత్తం 259 మంది అభ్యర్థుల్లో 65 మంది గ్రాడ్యుయేట్లు, 55 మంది 12వ తరగతి ఉత్తీర్ణులు, 39 మంది మెట్రిక్యులేట్లు ఉన్నారు. 36 మంది అభ్యర్థులు 8వ తరగతి ఉత్తీర్ణులు కాగా, తొమ్మిది మంది 5వ తరగతి ఉత్తీర్ణులయ్యారని ADR నివేదిక వెల్లడించింది.
మోతా పార్టీ
త్రిపురలో వామపక్ష-కాంగ్రెస్ కూటమి మళ్లీ పుంజుకోవడంతో పాటు కొత్తగా చేరిన తిప్రా మోతకు గిరిజన ప్రాంతాల్లో విస్తృత మద్దతు లభించడంతో ఈ ఎన్నిల్లో త్రిముఖ పోరు ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. TIPRA మోతా పార్టీ ప్రభావం పెరగడంతో ఈసారి 20 గిరిజన సీట్లలో ఈ పార్టీకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని పలువురు అంటున్నారు. ఎక్కువగా గిరిజనేతరులు నివసించే ప్రాంతాల్లో అధికార వ్యతిరేకత, శాంతిభద్రతల సమస్యలు అధికార పార్టీని దెబ్బతిశాయనే ఆరోపణలు సైతం ఉన్నాయి.
కాంగ్రెస్, సీపీఎం
2018లో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బేజేపీ 36 సీట్లతో అధికారంలోకి వచ్చింది. అందులో సగం గిరిజన ప్రాంతాల నుంచే గెలిచింది. బీజేపీ 43.59 శాతం ఓట్లను సాధించింది. ఈసారి కూడా బీజేపీకి పూర్తి మెజారిటీ వస్తుందని ఆయా నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయని అంటున్నారు. త్రిపురలో నియోజకవర్గాలు చిన్నవిగా ఉన్నాయని, కౌంటింగ్ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు బీజేపీ మెజారిటీ మార్కును దాటడం చూస్తారని అమిత్ షా అన్నారు. కాంగ్రెస్, సీపీఎం చేతులు కలపడం వల్ల బీజేపీని సొంతంగా ఓడించే పరిస్థితి లేదన్నారు. గత ఎనిమిదేళ్లలో ప్రధాని మోదీ 51 సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించారని, ఈశాన్య ప్రాంతంలో పెరిగిన పరాయీకరణ భావనకు స్వస్తి పలికారని షా వెల్లడించారు.