తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీని కోసం బీజేపీకి వ్యతిరేకంగా ఇతర పార్టీల మద్దతు కూడపెట్టడానికి కూడా ఆయన ప్రయత్నిస్తున్నారు. కాగా.. ఈ విషయంలో ఆయన మరో స్టెప్ ముందుకు అడుగువేశారు. హైదరాబాద్ వేదికగా త్వరలోనే జాతీయ పార్టీ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో పలు దపాలుగా మంతనాలు జరిపిన కేసీఆర్.. కొత్త పార్టీకి సంబంధించిన విధి విధానాలకు తుది రూపు ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు లక్ష్యంగా ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండాతో జాతీయ పార్టీ ఏర్పాటుకు కేసీఆర్ కసరత్తు కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ‘భారత రాష్ట్ర సమితి’, ‘భారత నిర్మాణ సమితి’, ‘భారత ప్రజా సమితి’ లాంటి పేర్లను పరిశీలించి వీటిలో ఒక పేరును ఖరారు చేసే పనిలో ఉన్నట్లు సమాచారం.