»Tdp Women President Vangalapudi Anitha Fire On Rk Roja
TDPతో 40 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు: టీడీపీ నాయకురాలు అనిత
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల కొండ అపవిత్రం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ను మద్యాంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు జగన్ ఒక్క చాన్స్ అడిగారా అని నిలదీశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Election Results) ఫలితాలు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party-TDP) లో జోష్ నింపగా.. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)లో కలవరం రేపింది. ప్రస్తుతం రాజకీయంగా టీడీపీ (TDP) వైపు గాలి వీస్తోంది. నలుగురు ఎమ్మెల్యేల సస్పెండ్ (Suspend)తో వైసీపీ ఇరకాటంలో పడింది. మరికొందరు ఎమ్మెల్యేలు (MLAs) బయటకు వెళ్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే టీడీపీ మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత (Vangalapudi Anitha) కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో ఏకంగా 40 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని సంచలన ప్రకటన చేశారు. రాబోయేది తమ ప్రభుత్వమేనని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
విశాఖపట్టణం (Visakhapatnam)లో సోమవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అనిత మాట్లాడుతూ.. ‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు ఆత్మ ప్రబోధానుసారం ఓటు వేస్తే ఆగమేఘాలపై వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. దానికే ఉలిక్కిపడితే తమతో టచ్ లో ఉన్న ఎమ్మెల్యే గురించి తెలిస్తే సీఎం జగన్ (YS Jagan)కు పక్షవాతం వస్తుంది’ అని పేర్కొన్నారు. మంత్రులు రోజా (RK Roja), గుడివాడ అమర్ నాథ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి ఆవేదనతో మాట్లాడితే.. ఊసరవెల్లి శ్రీదేవి అంటూ మంత్రి అమర్ నాథ్ మాట్లాడడం దారుణం. ఎంత డబ్బు ఇచ్చి జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావును వైసీపీ తన పార్టీలోకి లాక్కుందో చెప్పాలి’ అని సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా రోజాపై అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమను విమర్శించే ముందు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకోవాలి అని సూచించారు. ‘పులివెందుల నియోజకవర్గంలో టీడీపీకి, వైసీపీకి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకుని రోజా మాట్లాడాలి’ అని హితవు పలికారు. సీఎం జగన్ గంజాయిను రాష్ట్ర పంటగా మార్చినా ఆశ్చపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తిరుమల కొండపై గంజాయి దొరకడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అని అనిత ధ్వజమెత్తారు. ఇటీవల తిరుమల కొండపై గంజాయి లభించడంపై భక్తుల్లో కలవరం మొదలైంది. ఈ సంఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. గతంలో కూడా తిరుమల కొండపై నిషేధిత పదార్థాలు చేరాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమల కొండ అపవిత్రం అవుతోంది. ఆంధ్రప్రదేశ్ ను మద్యాంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు జగన్ ఒక్క చాన్స్ అడిగారా అని నిలదీశారు.