»Tamilisai Soundararajan Said Development Does Not Mean Only One Family In Telangana At G20 Summit Hyderabad
Tamilisai soundararajan: అభివృద్ధి అంటే ఒక్క ఫ్యామిలీనే కాదు
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan) రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు ప్రభుత్వం ప్రొటోకాల్‌లను పాటించడం లేదని, గవర్నర్ రాజ్యాంగబద్ధమైన కార్యాలయాన్ని గౌరవించడం లేదని సౌందరరాజన్ కేసీఆర్ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు సచివాలయం, అంబేద్కర్ కార్యక్రమాల ప్రారంభోత్సవానికి తనను ఆహ్వానించలేదని వెల్లడించారు.
తెలంగాణ గవర్నర్(telangana governor) తమిళిసై సౌందరరాజన్(tamilisai soundararajan) రాష్ట్రంలో కేసీఆర్(KCR) ప్రభుత్వ వైఖరిపై మరోసారి అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి అంటే కేవలం ఒక్క కుటుంబం మాత్రమే కాదని..ప్రజలందరూ కూడా డెవలప్ కావాలని ఆమె అభిప్రాయం వ్యక్తం చేశారు. జీ20 సమావేశాల్లో భాగంగా హైదరాబాద్(hyderabad) గచ్చిబౌలిలో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆమె పాల్గొన్న క్రమంలో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పలువురు నేతలు మాటలు బాగా చెబుతారు. కానీ పనులు మాత్రం చేయరని కేసీఆర్ ను ఉద్దేశించి ఎద్దేవా చేశారు.
అంతేకాదు కొత్తగా నిర్మించిన రాష్ట్ర సచివాలయం ప్రారంభోత్సవానికి సైతం తనను ఆహ్వానించలేదని గవర్నర్ తమిళిసై(tamilisai) సౌందరరాజన్ అన్నారు. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమానికి తనకు ఎలాంటి ఆహ్వానం రాలేదని వెల్లడించారు.
మరోవైపు సౌందరరాజన్‌కు ఆహ్వానం పంపినప్పటికీ ప్రారంభ కార్యక్రమానికి హాజరు కాలేదని తెలంగాణ మంత్రి చేసిన ఆరోపణలను గవర్నర్ కార్యాలయం ఖండించింది. ఆహ్వానం లేని కారణంగానే గవర్నర్ కార్యక్రమానికి హాజరు కాలేదని, మరో కారణం లేదని రాజ్‌భవన్ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఆదివారం మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర శాసనసభ్యులు, బీఆర్ఎస్ నేతలు, ఉన్నతాధికారుల సమక్షంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సచివాలయాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవ వేడుకలను గైర్హాజరు చేసినందుకు గవర్నర్‌పై ఇంధన శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి విరుచుకుపడిన మరుసటి రోజు రాజ్‌భవన్ నుంచి స్పష్టత వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానాలు పంపిన తర్వాత కూడా ఈ కార్యక్రమానికి విపక్ష నేతలు హాజరుకాకపోవడంపై ఆయన వ్యాఖ్యలు చేశారు.
అంతకు ముందు 125 అడుగుల బీఆర్ విగ్రహావిష్కరణకు కూడా గవర్నర్‌ను ఆహ్వానించకుండా రాష్ట్ర ప్రభుత్వం గతంలో కూడా ఆరోపణలు చేసింది. దీనిపై స్పందించిన సౌందరరాజన్ ఇలాంటి సంఘటనలు తనకు బాధను కలిగిస్తున్నాయని ఆమె వెల్లడించింది.
అయితే గవర్నర్ కోటా కింద తెలంగాణ శాసనమండలి సభ్యునిగా బీఆర్ఎస్ నేత పి.కౌశిక్‌రెడ్డిని నామినేట్ చేయాలంటూ రాష్ట్ర మంత్రివర్గం చేసిన సిఫార్సును ఆమె ఆమోదించలేదు. దీంతో 2021 నుంచి గవర్నర్, కేసీఆర్ ప్రభుత్వం మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి.