ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోట సమీప ప్రాంతాలపై రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Southwest Monsoon winds: సాగు కోసం సిద్దమైన రైతులకు గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon winds) ప్రవేశించాయి. తిరుపతి జిల్లా శ్రీహరికోట సమీప ప్రాంతాలపై రుతుపవనాలు విస్తరించాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీహరి కోట, కర్ణాటక, తమిళనాడు ధర్మపురి, రత్నగిరి, శివమొగ్గ, హాసన్ ప్రాంతాలపై రుతుపవనాలు విస్తరించాయని పేర్కొంది. వచ్చే 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది. ఇక వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ వివరించింది.
సాగు సన్నాహాక పనుల్లో రైతులు నిమగ్నం అయ్యారు. ఇప్పటికే వరి కుప్పలు తగులబెట్టడం.. విత్తనాలు, ఎరువుల కొనుగోలు చేసేందుకు చూస్తున్నారు. మరికొందరు రైతులు కొనుగోలు చేశారు. వర్షాలు పడటం మొదలైతే పంటలతో బిజీగా ఉంటారు. బోర్లు, కాలువ కింద పొలం వేసే కొందరు ఇప్పటికే పనుల్లో నిమగ్నం అయ్యారు. వర్షం ఆధారంగా పంటలు వేసే వారు మాత్రమే.. వరుణ దేవుడి కరుణ కోసం చూస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఈ రోజు, రేపు, ఎల్లుండి ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. తెలంగాణ రాష్ట్రంలో ఈ రెండు రోజులు అక్కడక్కడ వడగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఖమ్మం, కొత్తగూడెం, ఆదిలాబాద్, కుమురంభీమ్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఈ రోజు.. ఆదిలాబాద్, కుమురంభీమ్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో రేపు వడగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది.