తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో ఊహించని పరిణామం ఎదురైంది. కొద్ది నెలలుగా కాంగ్రెస్ పార్టీతో అంటీ అట్టనట్టు ఉంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గాంధీభవన్‌లోకి అడుగు పెట్టారు. రేవంత్ రెడ్డి టీపీసీసీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు. కాగా.. అందరికీ షాక్ ఇస్తూ ఈరోజు గాంధీ భవన్ లో ఇద్దరూ భేటీ అయ్యారు. రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్ రావు థాక్రేతో కలిసి భేటీ అయి పార్టీ గురించి మాట్లాడుకున్నారు. వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరిన తర్వాత.. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో వెంకట్ రెడ్డి దూరదూరంగా ఉంటున్నారు. కాగా.. ఆ ఎన్నికల్లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీ నుంచి పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతు తెలపడంతో విబేధాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలవడం, చెవిలో గుసగుసలాడుకోవడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
గతంలో రేవంత్ రెడ్డితో నువ్వా.. నేనా.. నాలుగుసార్లు ఓడిపోయిన వారి పక్కన నేను కూర్చోవాలా అంటూ కాంట్రవర్సీ కామెంట్లు చేశాడే వెంకట్ రెడ్డి. అవన్నీ మరిచిపోయి ఈరోజు గాంధీ భవన్ లో ముచ్చట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ సీనియర్లు ఎంత ప్రయత్నించినా.. ఇద్దరి మధ్య పొసగలేదు. దీంతో ఇంఛార్జిలను మారుస్తూ వచ్చింది. తాజాగా తెలంగాణ ఇంఛార్జి బాధ్యతలు తీసుకున్న మాణిక్ రావ్ థాక్రే వల్ల పార్టీలో మెల్లమెల్లగా మార్పు వస్తోంది. గతాన్ని పక్కన పెట్టి కాంగ్రెస్ నేతలు ఒక్కొక్కరుగా కలిసిపోతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో కాంగ్రెస్ నేతలు కలిసిపోవడం ఆ పార్టీకి కలిసి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు రాజకీయ నిపుణులు.