ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో చనిపోయిన మహిళ బొటన వేలిముద్రను ఆమె బంధువులు ఫోర్జరీ చేయడానికి ప్రయత్నించిన సంఘటన వెలుగు చూసింది. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఈ వీడియో 2021 సంవత్సరంలో జరిగింది. సదరు మహిళ మనవడు జితేంద్ర శర్మ పోలీసులకు ఫిర్యాదు చేసి, నేరం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తన తల్లికి అత్త అయిన కమలా దేవి మే 8, 2021న మరణించిందని, ఆమె భర్త అంతకు ముందే చనిపోయాడని, ఆ దంపతులకు పిల్లలు లేరని ఆయన చెప్పారు.
జితేంద్ర తెలిపిన వివరాల ప్రకారం వృద్ధ మహిళ మరణించిన తర్వాత, ఆమె బావ కొడుకులు ఆమె మృతదేహాన్ని ఆగ్రా హాస్పిటల్ కు తీసుకు వెళ్తున్నట్లు పేర్కొన్నారు. కాస్త దూరం వెళ్లాక వారు కారును ఆపి నకిలీ వీలునామాపై ఆమె బొటనవేలు ముద్ర వేయడానికి ఒక న్యాయవాదిని పిలిచారు. నకిలీ పత్రాల ఆధారంగా ఇల్లు, దుకాణం సహా ఆస్తులను స్వాధీనం చేసుకున్నారని ఆరోపించారు. కమలా దేవి బొటన వేలి ముద్రను కాకుండా సంతకాన్ని ఉపయోగించినందున కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చిందని జితేంద్ర శర్మ చెప్పారు. ఆమె ఎప్పుడు కూడా బొటన వేలి ముద్రను ఉపయోగించదని, సంతకం చేస్తారన్నారు.
ఒక న్యాయవాది స్టాంప్ ప్యాడ్ పైన ఆమె బొటన వేలును ఉపయోగించినప్పుడు, అనేక పేజీలలో ఆమె బొటనవేలు ముద్రలు వేయించడం వల్ల ఆ మృతదేహం కారు వెనుక సీటులో పడి ఉన్నట్లు ఇటీవల వెలువడిన 45 సెకన్ల వీడియోలో కనిపించిందని, దీంతో తమ కుటుంబంలో అనుమానాలు మరింత బలపడటమే కాదని, ధృవీకరించుకున్నట్లు చెప్పారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేయడంతో పాటు ఆగ్రా పోలీసులు విచారణ జరిపారు. చాలామంది వీడియోలో కనిపించే వారి తీరుపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఇది అమానవీయ ప్రవర్తన అని, అత్యల్పస్థాయి గుణం కలిగిన వారే అలా చేస్తారని, అలాంటి వారిని సామాజిక బహిష్కరణకు గురి చేయాలని మండిపడుతున్నారు. అలాగే, ఫోర్జరీకి సహకరించిన న్యాయవాదిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. మరికొందరు ఆయన లైసెన్స్‌ను రద్దు చేయాలని సూచించారు.