కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు ప్రాంతాలు, వివిధ స్మారక నిర్మాణాలు తదితర వాటి పేర్లు మారడం మొదలుపెట్టింది. ముఖ్యంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పట్టణాల పేర్లు మారుస్తున్నారు. ఢిల్లీలోని రాజ్ పథ్ మార్గం పేరును కర్తవ్య పథ్ గా మార్చిన విషయం తెలిసిందే. తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఢిల్లీలోని మరో ముఖ్యమైన ప్రాంతానికి పేరు మార్చింది. స్వాతంత్ర్యం పూర్తి చేసుకుని 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీకా అమృత్ మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు గుర్తుగా రాష్ట్రపతి భవన్ లో ఉన్న మొఘల్ గార్డెన్స్ పేరును మార్చేశారు. ఇకపై అమృత్ ఉద్యాన్ గా మారుస్తూ శనివారం ఉత్తర్వులు వెలువడ్డాయి.
రాష్ట్రపతి భవన్ లో మొఘల్ గార్డెన్ కు ఒక ప్రత్యేకత ఉంది. ఆ గార్డెన్ లో అత్యంత అరుదైన పూలు, మొక్కలు ఉంటాయి. ఏడాదికోసారి సాధారణ ప్రజలను సందర్శించేందుకు అనుమతి ఇస్తారు. అమృత్ ఉద్యాన్ ను ఈనెల 29న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు. అనంతరం 31వ తేదీ నుంచి నెల రోజుల పాటు సాధారణ ప్రజలకు అనుమతి ఇస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ అధికారి నవికా గుప్తా వివరించారు. రాష్ట్రపతి భవన్ లో మొత్తం 15 ఎకరాల్లో ఈ గార్డెన్ విస్తరించి ఉంది. మొఘల్ చక్రవర్తులు ఈ గార్డెన్ ను నిర్మించడంతో మొఘల్ గార్డెన్ గా పేరు వచ్చింది. పర్షియన్ శైలిలో ఈ గార్డెన్ లో తోటలు ఉన్నాయి. సరస్సులు, ఫౌంటెన్లు, కాలువలు ఈ గార్డెన్స్ లో ఉండడం మరో ప్రత్యేకత.