Priyanka Gandhi:బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రియాంక గాంధీ నిప్పులు చెరిగారు. సరూర్నగర్లో యువ సంఘర్షణ సభలో ఆమె ప్రసంగించారు. మిత్రులారా అంటూ ప్రియాంక గాంధీ తెలుగులో మాట్లాడారు. జై బోలో తెలంగాణ అని నినాదించారు. తెలంగాణ మీకు నేల కాదు.. తల్లి లాంటిది ప్రియాంక గాంధీ అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను తమ తల్లి సోనియా గాంధీ నెరవేర్చారని పేర్కొన్నారు.
తెలంగాణ ఏర్పడ్డాక 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ప్రియాంక తెలిపారు. నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామన్నారు.. ఇప్పుడు ఏమైంది? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఫ్యామిలీ జగిర్దార్లు అనుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. టీఎస్ పీఎస్సీ పేపర్ లీక్ అయిన ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఒక్కరిపై చర్యలు తీసుకున్నారా అని అడిగారు. గత 9 ఏళ్లలో వర్సిటీల్లో నియామకాలు జరగడం లేదని పేర్కొన్నారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, మరిచారని ప్రియాంక గాంధీ మండిపడ్డారు. రాష్ట్రంలో 40 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని గుర్తుచేశారు. ప్రైవేట్ రంగంలో వర్సిటీలకు అనుమతి ఇవ్వడం ఏంటీ అని అడిగారు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ వ్యక్తిపై లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పారు. కేసీఆర్ ఫ్యామిలీ రాష్ట్రానికి ఏం చేసిందని అడిగారు. త్యాగం అంటే ఏంటో తనకు తెలుసు అని.. తమ కుటుంబానికి తెలుసు అని చెప్పారు.కేసీఆర్ సర్కార్ విద్య రంగానికి నిధులు తగ్గిస్తోందని ప్రియాంక గాంధీ తెలిపారు. ఇందిరను స్మరిస్తూ.. తప్పుడు హామీలను తాను ఇవ్వలేదని ప్రియాంక తెలిపారు.
బై బై మోడీ, బై బై కేసీఆర్ అంటూ ప్లెక్సీలు వెలిచిన విషయాన్ని ప్రియాంక ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. తమ ప్రభుత్వం పనిచేయకుంటే తొలగించాలని ప్రియాంక గాంధీ కోరారు. టీఎస్ పీఎస్సీని యుపీఎస్సీ తరహాలో బలోపేతం చేస్తామని ప్రకటించారు. 4 త్రిపుల్ ఐటీలు నిర్మిస్తామని ప్రియాంక హామీనిచ్చారు. స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తాం.. విద్యార్థినిలకు ఉచితంగా స్కూటీ అందజేస్తామని తెలిపారు. జై హింద్ అని నినాదించడంతో ప్రియాంక ప్రసంగం ముగిసింది.