కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పైన ప్రధాని నరేంద్ర మోడీ, బిజెపి నేతలు చేసిన వ్యాఖ్యల పైన ఆయన సోదరి ప్రియాంక గాంధీ తీవ్రంగా స్పందించారు. మీరు ఒక అమరవీరుడి కొడుకును, దేశ ద్రోహి అని, మీర్ జాఫర్ అని అవమానిస్తున్నారు అని ధ్వజమెత్తారు. రాహుల్ పైన అనర్హత వేటును నిరసిస్తూ కాంగ్రెస్ దేశవ్యాప్తంగా సంకల్ప సత్యాగ్రహ దీక్షలను చేపట్టింది. ఈ సందర్భంగా ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద ప్రియాంక, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే సహా ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మీరు మా అన్న పదం పైన ఇష్టారీతిన విమర్శలు చేస్తారని, మా అమ్మని, మా కుటుంబాన్ని రోజూ అవమానిస్తారని నిప్పులు చెరిగారు. అయినప్పటికీ మీ పార్టీ వారి మీద ఒక్క కేసు ఎందుకు లేదని ప్రశ్నించారు.
రాహుల్ పైన పరువునష్టం దావా వేసిన వ్యక్తి పూర్ణేశ్ మోడీ తాను వేసిన కేసుపై దాదాపు ఏడాది పాటు స్టే పొందాడని, పార్లమెంటులో అదానీపై రాహుల్ మాట్లాడిన కొద్ది రోజులకు అదే వ్యక్తి మళ్లీ కేసును విచారించాలంటూ కోర్టును ఆశ్రయించాడని, దేశంలో ఎన్నో ఏళ్లుగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి… కానీ ఈ కేసులో అన్నీ చాలా వేగంగా జరిగిపోయాయన్నారు. నెల రోజుల్లో విచారణ జరిపి, తీర్పు కూడా ఇచ్చారని, రాహుల్కు రెండేళ్ల జైలు శిక్ష విధించారని, మరుసటి రోజే ఎంపీగా డిస్-క్వాలిఫై చేశారని గుర్తు చేశారు. ఎనిమిదేళ్ల పాటు పోటీకి అనర్హుడని చేశారన్నారు. తమ కుటుంబం నెహ్రూ అనే ఇంటి పేరును ఎందుకు పెట్టుకోదు అని ప్రధాని ప్రశ్నించాడన్నారు. మేం మరింత బలంగా పోరాడుతామని చెప్పారు.
కాగా రాహుల్ గాంధీ డిస్-క్వాలిఫికేన్ ను ప్రశ్నిస్తున్న కాంగ్రెస్.. అది రాజ్యాంగబద్ధంగా లేదని, చట్టపరంగా బిజెపి చేయలేదని మాత్రం చెప్పలేక పోతోంది. ఇప్పుడు రాహుల్ విషయంలో జరిగినట్లే గతంలో జయలలిత, లాలూ ప్రసాద్ విషయాల్లో కూడా జరిగింది. కోర్టు ద్వారా రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడితే వెంటనే సదరు చట్ట సభ్యుడు అనర్హతకు గురవుతాడు. ఇది ఏళ్లుగా వస్తున్న చట్టం. దీనిని మార్చి 2013లో మన్మోహన్ సింగ్ ఆర్డినెన్సు తీసుకు వచ్చారు. అలాంటి కేసుల్లో శిక్ష పడిన వారికి 6 నెలలు కోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి సమయం ఉండాలి అని ఆర్డినెన్సు తెచ్చారు. కానీ అలా శిక్ష పడిన వారిని ఉపేక్షించవద్దు… వెంటనే డిస్ – క్వాలిఫై చేయాలనే ఉద్దేశంతో రాహుల్ గాంధీయే దానిని చించివేశారు. ఇప్పుడు తన వరకు వచ్చే సరికి రాహుల్, కాంగ్రెస్.. ఇలా స్పందించడం చూసి ప్రజలు విస్తు పోతున్నారని బిజెపి ఎద్దేవా చేస్తోంది.